Share News

Local Elections: స్థానికానికి సన్నద్ధం!

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:25 AM

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానం మనసులో మెదులుతున్నా.. షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో మునిగిపోయాయి......

Local Elections: స్థానికానికి సన్నద్ధం!

  • రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, సన్నబియ్యం, బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌ ఆశలు

  • ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్‌ఎస్‌ నేతల ఆశాభావం

  • ఆ పార్టీల వైఫల్యాలపై ప్రచారానికి బీజేపీ నిర్ణయం

  • ఎనిమిదో తేదీన హైకోర్టు ఆదేశాలపై పార్టీల్లో ఉత్కంఠ

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానం మనసులో మెదులుతున్నా.. షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో మునిగిపోయాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ... ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడం, అధికార పార్టీ కావడం.. తమకు లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలు, హామీల అమల్లో వైఫల్యమే తమను గెలిపిస్తుందన్న అంచనాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. ఈ రెండు పార్టీల వైఫల్యాలే.. తమను విజయతీరాలకు చేరుస్తుందని బీజేపీ భావిస్తోంది.

వ్యూహ, ప్రతివ్యూహాల్లో పార్టీలు

ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో తెలియజేయడానికి ప్రజలకు వచ్చిన తొలి అవకాశం కావడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. అయితే, అధికార పార్టీ కావడం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, పంట రుణాల మాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాల అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఉందని భావిస్తున్నాయి. వీటికి తోడు ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచడం సానుకూల అంశంగా మారనుందని అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టనున్నామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు గీటురాయి కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. కాగా, పథకాల అమల్లో ప్రభుత్వం వైఫల్యంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని బీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, పార్టీ నుంచి కేసీఆర్‌ కూతురు కవిత సస్పెన్షన్‌, కాళేశ్వరంపై కేసీఆర్‌, హరీశ్‌ను సీబీఐ విచారించే అవకాశం ఉండటం, ఫార్ములా ఈ రేసు కేసు కేటీఆర్‌ మెడకు చుట్టుకోవడం వంటి పరిస్థితులతో ఆ పార్టీ క్యేడర్‌ గందరగోళంలో ఉందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన గులాబీ పార్టీ.. మళ్లీ నిలదొక్కుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మరోవైపు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పంచాయతీల్లో చేపట్టిన ప్రతీ అభివృద్ధి పనికీ కేంద్రమే నిధులిస్తోందంటూ విస్తృతంగా ప్రచారం చేయనుంది. పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ‘మా విజయం కోసం కార్యకర్తలు శ్రమించారు.. ఇప్పుడు వారిని గెలిపించడం మా లక్ష్యం’ అని ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.


అందరి చూపూ ఎనిమిదో తారీఖువైపు

నోటిఫికేషన్‌ ఇచ్చినా పిటిషన్లను విచారిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకుల్లో ఈనెల ఎనిమిదో తేదీన న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలను ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం.. దానిని విచారించిన న్యాయస్థానం ప్రభుత్వం బిల్లు గవర్నర్‌ వద్ద పెండింగులో ఉండగా జీవో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసి విచారణను ఎనిమదో తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూడా తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు పెట్టేలా షెడ్యూలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎనిమిదో తేదీ ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ఉన్నాయి.

Updated Date - Sep 30 , 2025 | 05:25 AM