NEET Counseling: జీవో 33తో మా పిల్లలకు అన్యాయం
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:07 AM
జీవో నెంబరు 33తో తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు...
వారి ఉన్నత చదువుకు అవకాశం కల్పించండి
ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం
పాల్వంచ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జీవో నెంబరు 33తో తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 2025-26 నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ ఫైనల్ మెరిట్ లిస్టులో తమ పిల్లల పేర్లను చేర్చి.. వారి ఉన్నత చదువులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పిల్లలు తెలంగాణ వాసులేనని.. పక్క రాష్ట్రం ఏపీలో ఇంటర్మీడియట్ చదువుకున్నంత మాత్రాన జీవో నెంబరు 33 ద్వారా లోకల్ అర్హత కోల్పోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ జీవో జారీ చేయడానికి ముందే తాము ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ జీవో తమ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.