అస్తవ్యస్తంగా పంచాయతీలు
ABN , Publish Date - May 24 , 2025 | 12:02 AM
గ్రామాల్లో ప్రత్యేక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో సర్పంచుల పాలన గడువు ముగిసి ఏడాదిన్నర దాటింది.
అస్తవ్యస్తంగా పంచాయతీలు
ప్రత్యేక పాలనలో ప్రజల ఇక్కట్లు
నిధులు రాక అధికారుల అవస్థలు
గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి
నల్లగొండరూరల్, మే 23(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రత్యేక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో సర్పంచుల పాలన గడువు ముగిసి ఏడాదిన్నర దాటింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సి నిధులు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఆయా పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిపోతోంది. ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేక అధికారులు రాకపోవడంతో పారిశుధ్య నిర్వహణ, వీధిలైట్లు, డ్రైనేజీల్లో పూడికతీత అస్తవ్యస్తంగా తయారైంది. పాలక మండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలనే మార్గదర్శకాలు ఉండటంతో ఏడాది కాలంగా 17వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. సిబ్బంది వేతనాలకు మాత్రమే నిధులు విదుల్చుతుండటంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు, కొత్త వీధిలైట్లు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి.
అధికారులు బిజీబిజీ
పాలకమండళ్లు రద్దయిన తర్వాత గత ఫిబ్రవరి లో ప్రభుత్వం మండల, జిల్లా స్థాయి అధికారులను పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించిం ది. వారు మాతృశాఖ పనుల్లోనే బిజీగా ఉంటుండ టం, అదనపు బాధ్యతలు భారంగా మారుతున్నాయి. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నా రు. దీనికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం లేకపోవడంతో మెజార్టీ ఇనచార్జీలు కనీసం వారానికి ఒకరోజు కూడా ఆఫీసులో కనిపించడం లేదు. ఇటు అంతర్గత వనరులు లేక, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాక పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.
చిన్నచిన్న అవసరాలకూ పక్క చూపులే..
వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, మోటార్ల మరమ్మతులు, పార్కుల నిర్వహణ, శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టే చిన్నచిన్న మరమ్మతులకు కూడా ఎమ్మెల్యే, ఎంపీ నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. గ్రామాల్లో కనీసం పాడైన వీధిలైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోలేని దుస్థితి. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించే చర్యలకు నిధుల లేమి సమస్యగా మారింది. సర్పంచులు మాత్రమే కాదు. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడం, ఆశించిన నిధులు రాకపోవడం, వెరసి ఆర్థిక సంక్షోభానికి కారణమవుతోంది. ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఫైనాన్స నుంచి వచ్చే నిధులు గతేదాది నుంచి రాకపోవడం, వివిధ రకాల కారణాలతో తరచూ ఎన్నికలను వాయి దా వేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా గ్రామంలో అభివృద్ధి పనులు లేక ప్రజల అవస్థలు పడుతున్నారు.