Panchayat Elections: హమ్మయ్య పంచాయితీ తప్పినట్టే
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:01 AM
సార్.. మా వీధిలో లైట్లు వెలగట్లేదు అయ్యా గ్రామంలో తాగునీరు సరఫరా కావట్లేదు ఊళ్లో రోడ్ల సమస్య పరిష్కరించండి.. ఎమ్మెల్యేలకు గ్రామాల ప్రజల నుంచి తరచూ వస్తున్న ఫోన్లు ఇవి. గ్రామస్థాయిలో జవాబుదారీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతీ చిన్న పనికి ప్రజలు...
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఎమ్మెల్యేలకు ఊరట
ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్న గ్రామస్తులు
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఇబ్బందులు
పంచాయతీ ఎన్నికలతో గ్రామ స్థాయిలో జవాబుదారీ వ్యవస్థ
ప్రభుత్వానికి అందనున్న రూ.3 వేల కోట్ల కేంద్ర నిధులు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘సార్.. మా వీధిలో లైట్లు వెలగట్లేదు! అయ్యా గ్రామంలో తాగునీరు సరఫరా కావట్లేదు! ఊళ్లో రోడ్ల సమస్య పరిష్కరించండి’.. ఎమ్మెల్యేలకు గ్రామాల ప్రజల నుంచి తరచూ వస్తున్న ఫోన్లు ఇవి. గ్రామస్థాయిలో జవాబుదారీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతీ చిన్న పనికి ప్రజలు, క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు నేరుగా ఎమ్మెల్యేలను సంప్రదించడం పెరిగింది. క్షేత్రస్థాయిలోని చిన్న చిన్న సమస్యలను పట్టించుకుని, పరిష్కరించడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అదే సమయంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రామస్థాయిలో అధికారిక వ్యవస్థ లేకపోవడం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్యేలకు ఊరటనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కలుపుకొని ఏకంగా 1.25 లక్షల మంది గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలకు పదవులు దక్కనుండటంతో ఉత్సాహం కనిపిస్తోంది.
స్థానికంగానే సమస్యల పరిష్కారానికి అవకాశం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై తేలకపోవడంతో ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీనితో గ్రామ స్థాయిలో పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రోడ్ల నిర్వహణ, గ్రామ విస్తరణ ప్రణాళిక అమలు, స్థానిక పన్నుల వసూళ్లు, చిన్నచిన్న వివాదాలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక వంటివి సమస్యాత్మకంగా మారాయి. ఇలాంటి సమయంలో డిసెంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియ ముగించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో.. కొత్త సంవత్సరం నుంచి గ్రామస్థాయిలో పాలన పూర్తిగా గాడినపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్ర నిధులూ అందే అవకాశం
కేంద్ర 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)తో ముగుస్తోంది. ఈ ఏడాదికి ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు 3వేల కోట్ల నిధులు రావాల్సి ఉంది. కానీ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా ఆ నిధులు నిలిచిపోయాయి. మరో 4 నెలలు గడిస్తే.. కొత్త ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. పాత బకాయిలు మురిగిపోయే అవకాశం ఉంది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే పెండింగ్‌లో ఉన్న 3 వేలకోట్లు అందుతాయి. పంచాయతీల్లో తక్షణ సమస్యలను తీర్చేందుకు కొత్త పాలక మండళ్లకు ఉపయోగపడతాయి.
క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తకలు పదవులు..
ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పదవుల లేక కాంగ్రెస్ స్థానిక నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో 12,733 గ్రామాల్లో సర్పంచ్‌లు, 1,12,288 మంది వార్డు సభ్యులు కలిపి 1.25 లక్షల మందికి పదవులు దక్కనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, వరుస ఓటములతో బీఆర్‌ఎస్ బలహీనపడటం నేపథ్యంలో.. మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనితో వేలాది మంది నేతలు, కార్యకర్తలకు పదవులతో పార్టీకి, ప్రభుత్వానికి అవసరమైన బలమైన వ్యవస్థ ఏర్పాటవుతుందని అంటున్నారు. పార్టీపరంగా 42శాతం బీసీలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం నేపథ్యంలో.. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకత్వమూ ఎదుగుతుందని చెబుతున్నారు.