పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:35 PM
రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జెడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్‌కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జెడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో ఉంటాయన్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ నెల 9న ఉదయం 10.30 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేసన్‌ల స్వీకరణ ఉంటుందని, 12న నామినేషన్‌ల పరిశీల, చెల్లుబాటయ్యే నామినెటెడ్ అఽభ్యర్ధుల జాబితా, 13న అప్పీళ్ల స్వీకరణ, 14న అప్పీళ్ల పరిష్కరణ, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్ధిత్వం ఉపసంహరణ, 3 గంట లతర్వాత పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రచురణ, 23న పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. నామినేషన్‌ల స్వీకరణలో నిబంధనలు పాటించాలన్నారు. నామినేషన్‌ఫారాలు, రిజిష్టర్‌లు సక్రమంగా నిర్వహించాలన్నారు. నామినేషన్‌ల సమయంలో వీడియోగ్రఫీ ఉండాలన్నారు. ఎన్నికల గుర్తులు కేటాయించే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు. 1995 సంవత్సరం తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగిన అభ్యర్ధులు పోటీకి అనర్హులని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించాలని, నిబందనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.