Tragedy: ఓటమి బెంగతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:25 AM
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సీహెచ్ రాజు(36) ఆత్మహత్య చేసుకున్నారు....
అయ్యప్ప మాలలోనే ఉరేసుకుని బలవన్మరణం
గుండెపోటుతో మరో ఇద్దరు అభ్యర్థులు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సీహెచ్ రాజు(36) ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే ఆందోళనతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. నమ్ముకున్న వారే ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మనోవేదనకు గురై 3రోజులుగా ఒంటరిగానే ప్రచారాన్ని కొనసాగించారు. ఆదివారం సాయంత్రం ఛాతీలో నొప్పి ఉందంటూ రాయికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న రాజు శంషాద్దీన్‌పూర్ గ్రామ శివారులో గల అయ్యప్ప సన్నిధానంలో తోటి స్వాములతో ఉంటున్నారు. తాను ఓడిపోతానని, తనకు చావే శరణ్యమని ఆదివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేయగా తోటి స్వాములు ధైర్యం చెప్పారు. తెల్లవారాక రాజు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రచారంలో కుప్పకూలిన వార్డు అభ్యర్థి
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మంచర్లగూడకు చెందిన పల్లె లత(42) గ్రామంలోని 8వ వార్డుకు పోటీ చేస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహిస్తూ గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబీకులు కాంటినెంటల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.
గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి
సంగారెడ్డి చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ పంచాయతీలో 8వ వార్డుకు పోటీ చేస్తున్న కొత్తొల్ల పద్మరావు(50) గుండెపోటుతో మృతిచెందారు. ఆదివారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మధ్యరాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. మూడో విడతలో ఎన్నికలు జరగనున్న ఈ వార్డుకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా, పద్మారావు మృతితో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య రెండుకు చేరింది. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని అధికారులు తెలిపారు.
వంగపల్లి సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు
తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ పత్రంతో ప్రచారం చేస్తున్న అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లికి చల్ల కమలాకర్ రెడ్డి బాడ్‌పేపరతో ప్రచారం చేస్తుండగా.. ఎన్నికల నిబంధన ఉల్లంఘనగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.