Panchayat Elections: ముగిసిన పంచాయతీ పర్వం
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:10 AM
గత రెండు వారాలుగా పల్లెల్లో నెలకొన్న ఎన్నికల పండగ సందడి ముగిసింది! రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మూడు విడతల్లో చేపట్టిన చేపట్టిన పంచాయతీ ....
ఓటెత్తిన గ్రామీణం.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకన్నా ఎక్కువ శాతం ఓటింగ్ మూడో విడతలో 85.77 ు పోలింగ్
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గత రెండు వారాలుగా పల్లెల్లో నెలకొన్న ఎన్నికల పండగ సందడి ముగిసింది! రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మూడు విడతల్లో చేపట్టిన చేపట్టిన పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. తొలివిడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న, రెండోవిడత 14న చేపట్టగా.. మూడో విడత ఎన్నికలకు బుధవారం పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. ఎస్‌ఈసీ షెడ్యూల్‌ప్రకారం 182 మండలాల పరిధిలో 4,159 గ్రామపంచాయతీలకుగాను.. 394 ఏకగ్రీవం కాగా, 11చోట్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండు పంచాయతీలపై స్టే విధించారు. దీంతో మిగిలిన 3,752 గ్రామ పంచాయతీలకు బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 36,452 వార్డు స్థానాలకుగాను 7908 చోట్ల ఏకగ్రీవం కాగా, 116 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 18 చోట్ల స్టే ఉంది. దీంతో 28,410 వార్డు స్థానాలకు ఎన్నిక జరిగింది. 75,725 మంది పోటీ పడ్డారు. మొత్తం 3,752 గ్రామ పంచాయతీల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఎస్‌ఈసీ అందించిన సమచారం మేరకు ఉదయం 7 నుంచి 9గంటల వరకూ 23.52 శాతం ఓటింగ్ నమోదైంది. 11 గంటలకు 57.91 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 80.78 శాతం పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటువేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఓటింగ్ పూర్తయ్యే సమయానికి.. 50,56,344 మంది ఓటర్లకుగాను 43,37,024 మంది (మొత్తం 85.77ు) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.56 శాతం పోలింగ్ నమోదుకాగా.. 76.45 శాతంతో నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తొలివిడతలో 84.28ు మంది, రెండో విడత ఎన్నికల్లో 85.86ు మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే.
అక్కడ కొంత ఆలస్యం..
గ్రామపంచాయతీల పరిధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ జరిపి సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఎక్కువ మంది ఓటర్లు క్యూలైన్లలో ఉన్నచోట మాత్రం కొంత ఆలస్యం జరిగింది. ఓట్లలెక్కింపు అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఎవరు గెలిచారనే విషయాన్ని.. సంబంధిత ఆర్వోలు అక్కడికక్కడే ప్రకటించారు. ఎస్‌ఈసీ అందించిన సమాచారం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయానికి.. 3,062 సర్పంచ్ స్థానాలు, 25,300 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఫలితాలను వెల్లడించారు. 2,048 మంది ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేసినట్లు ఎస్‌ఈసీ అధికారులు వెల్లడించారు. కాగా.. మూడువిడతలుగా జరిగిన ఎన్నికల్లో 11,497 గ్రామ పంచాయతీల్లో విజేతలుగా నిలిచిన సర్పంచులు 22న రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. 85,957 మంది వార్డు సభ్యులు సైతం పదవీ బాద్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 20 నుంచి పాలక వర్గాలు కొలువుదీరాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇదివరకే గెజిట్ జారీచేసినప్పటికీ.. ఆ రోజు మంచి ముహూర్తం లేదని రాజకీయవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పాలకవర్గాలు 22న రాష్ట్రవ్యాప్తంగా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా తేదీని మారుస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఆ రోజున మొదలై ఐదేళ్లపాటు కొనసాగనుంది. ఇక.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన కొత్త సర్పంచులకు, వార్డు సభ్యులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనుసూయ శుభాకాంక్షలు తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహించిన పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులను ఆమె అభినందించారు. నూతన సర్పంచు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్థి కోసం రాజకీయాలకు అతీతంగాపనిచేయాలని ఆకాంక్షించారు.