Panchayat Elections: ఇంటింటికి 5లక్షల బీమా.. ఆడబిడ్డ పుడితే 5వేలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:18 AM
పల్లెపోరులో హామీలు హోరెత్తుతున్నాయి. గెలిపించండి.. పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గనక దిగిపోతాను అంటూ ప్రతినబూనుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ....
రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో
బీమా హామీకే ఐదేళ్లలో 42.5 లక్షలు
ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్లు
బాండ్‌పేపర్‌పై 22 హామీలు రాసిచ్చిన గద్వాల జిల్లా సల్కాపురం అభ్యర్థి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
పల్లెపోరులో హామీలు హోరెత్తుతున్నాయి. గెలిపించండి.. పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గనక దిగిపోతాను అంటూ ప్రతినబూనుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఊర్లో 700 గడపలున్నాయి. ప్రతి ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.8.40 లక్షలు.. ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుంది. ఈ ఒక్క హామే కాదు.. మొత్తంగా 15 హామీలతో ఆమె మేనిఫెస్టో రూపొందించి ప్రకటించారు ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తెమట్టెలు చేయిస్తానని, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని మాటిచ్చారు. అలాగే ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్ వేసుకునే సమయంలో రూ. రూ.21వేలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ. ఉన్నత చదువులకు ఆర్థిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు. గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం వితరణ చేస్తానని ఆమె ప్రకటించారు. గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలో అభ్యర్థిగా ఆంజనేయులు నామినేషన్ దాఖ లు చేశారు. గ్రామంలో అమలు చేయనున్న 22 హామీలతో మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. ఈ హామీలను నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకొంటానని ప్రకటించారు. గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్, బీసీ స్మశానవాటికకు ఫెన్సింగ్, బోరు వేయించి, మోటారు ఏర్పాటు చేసి తాగు నీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వితంతు మహిళలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 10 వేల సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఊర్లో బీటీరోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు.
ఏకగ్రీవాల జోరు
ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో ఆలయాలను నిర్మిస్తామనే హామీతోనో, అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో, ఒక్కరే నామిషన్ వేయడంతోనో పలుచోట్ల అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో ఐదు గ్రామపంచాయితీలు ఏకగ్రీవమైతే ఇందులో వర్ని మండలంలోనే ఎనిమిది ఏకగ్రీవం అయ్యాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం శివారురాంరెడ్డిపల్లికి చెందిన ధరణి లక్ష్మి తనను ఎన్నుకొంటే గ్రామంలోని అంతర్గత రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేస్తానని హామీ ఇవ్వడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 22 గ్రామాలు, నిర్మల్ జిల్లాలో ఎనిమిది గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో.. పార్టీలకు అతీతంగా ముదిరాజ్ కులస్థులు ఏకమయ్యారు. తమకు ఎప్పుడూ అవకాశం రాలేదని, ఈసారి అవకాశం ఇవ్వాలంటూ హేమ దుర్గపతి అనే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఖమ్మం జిల్లాలో వేలంపాట రహితంగా ఆరు గ్రామాలు, జనగామ జిల్లాలో ఆరు, వరంగల్ జిల్లాలో ఐదు, మహబూబాబాద్ జిల్లాలో మూడు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలొ ఒక గ్రామం చొప్పున ఏకగ్రీవమయ్యాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి గ్రామంలో అభ్యర్థి వెంకటయ్య రూ.51.3 లక్షలతో ఊర్లో బొడ్రాయి ప్రతిష్ఠతో పాటు శివాలయం నిర్మిస్తానని మాటిచ్చారు. గుర్రంపోడు మండలం ములకలపల్లిలో అభ్యర్థి బొడ్డు లింగస్వామి రామాలయం నిర్మించేందుకు ముందుకురాగా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
కోతులు, కుక్కల బెడద తీర్చిన వారికే..
ఆ బెడద ఎంత తీవ్రంగా ఉంటే ఈ డిమాండ్ చేస్తారు చెప్పండి? మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రజలదీ డిమాండ్. సోమవారం ప్లకార్డులు పట్టుకొని మరీ.. కోతులు, కుక్కల బెడద తీర్చిన వారికే ఓటేస్తాం అంటూ నినాదాలు చేశారు. ఊర్లో ఉదయం సాయంత్రం సమయాల్లో కోతులు, కుక్కలు గుంపు గుంపులుగా వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయి. దాడుల్లో ఇటీవల పలువురు గాయపడ్డారు.
అమెరికా నుంచి వచ్చి బరిలోకి
నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామానికి చెందిన కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. ఓ ఆరేళ్లు పిల్లల వద్దే ఉండేందుకు ఆమె ఇటీవల అమెరికా వెళ్లింది. గ్రామాన్ని జనరల్‌కు కేటాయించడం, ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో నందిని హుటాహుటిన అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌గా నామినేషన్ వేశారు.
భారీగా నామినేషన్లు
రెండోవిడత సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ల రెండోరోజు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి కావడం, మధ్యాహ్నం తర్వాత విశేష ముహూర్తం ఉండటంతో అభ్యర్థులు కేంద్రాలకు పోటెత్తారు. దాదాపు సర్పంచ్ అభ్యర్థుల నుంచి 18వేల వరకు, వార్డు సభ్యుల స్థానాల కోసం 30వేల వరకు నామినేషన్లు దాఖలైనట్లు అంచనా. తొలిరోజు 2975 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 3608 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు అంచనా. ఇక తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు.