Share News

Tummala Nageshwar Rao: పామాయిల్‌ లక్ష్యం పూర్తిచేస్తారా? వైదొలుగుతారా?

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:58 AM

పది లక్షల ఎకరాల్లో పామాయుల్‌ తోటలు పెంచి... దేశంలో మొదటి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పామాయిల్‌ కంపెనీలు ఏమాత్రం సహకరించటంలేదని...

Tummala Nageshwar Rao: పామాయిల్‌ లక్ష్యం పూర్తిచేస్తారా? వైదొలుగుతారా?

  • వారం రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకొని ప్రభుత్వం వద్దకు రండి

  • ఇలా నిర్లక్ష్యంగా పనిచేస్తే 10 లక్షల ఎకరాల లక్ష్యం నెరవేరదు

  • పామాయిల్‌ కంపెనీల ప్రతినిధులపై మంత్రి తుమ్మల ఆగ్రహం

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పది లక్షల ఎకరాల్లో పామాయుల్‌ తోటలు పెంచి... దేశంలో మొదటి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పామాయిల్‌ కంపెనీలు ఏమాత్రం సహకరించటంలేదని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేటు కంపెనీలు చేస్తున్న వ్యాపారానికి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్నప్పటికీ... కంపెనీల నుంచి ఆశించిన సహకారం లభించటంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిర్ణీత వ్యవధిలో లక్ష్యం పూర్తిచేస్తారా? లేదంటే.. ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతారా? అనేది తేల్చుకోవాలని హెచ్చరించారు. వారం వ్యవధిలో కంపెనీల యాజమాన్యాలతో చర్చించి, ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వం ఎదుటకు రావాలని కంపెనీల ప్రతినిధులకు తుమ్మల సూచించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి.. పామాయుల్‌ కంపెనీల యజమానులను కూడా ఆహ్వానించాలని, సీఎం రామకృష్ణారావు కూడా ఈ సమీక్షలో పాల్గొంటారని తుమ్మల తెలిపారు. అప్పుడు తాడో, పేడో తేల్చుకోవాల్సిందేనని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఏడాదికి 2 లక్షల ఎకరాల చొప్పున, ఐదేళ్లలో 10 లక్షల ఎకరాల్లో పామాయుల్‌ తోటలు పెంచాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, మిగిలిన మూడేళ్లలో ఈ లక్ష్యం పూర్తికావాల్సిందేనని టార్గెట్‌ విధించారు. సచివాలయంలో సోమవారం 13 పామాయుల్‌ కంపెనీల ప్రతినిధులు, ఉద్యానశాఖ, ఆయిల్‌ఫెడ్‌ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పామాయుల్‌ కంపెనీల ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పామాయుల్‌ లక్ష్యాన్ని కొన్ని కంపెనీలు ఎక్కువ తీసుకున్నాయని, నిర్ణీత వ్యవధిలో టార్గెట్‌ పూర్తిచేయటం చేతకాకపోతే వైదొలగాలని హెచ్చరించారు. రెండు, మూడు జిల్లాలు ఒకే కంపెనీకి ఉన్నప్పుడు తలకు మించిన భారం అనిపిస్తే వదులుకోవాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారులు కూడా ఈ ఏడాది చేసిన ప్రణాళికను మార్చాలని, ఇప్పుడున్న లక్ష్యాన్ని రెండింతలు చేయాలని, ఏడాదికి 2 లక్షల ఎకరాలు లక్ష్యాన్ని నిర్దేశించాలని, మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు పామాయిల్‌ సాగు విస్తీర్ణం చేరుకోవాల్సిందేనని తుమ్మల సూచించారు. కంపెనీల పనితీరు సక్రమంగా లేనప్పుడు ఒప్పందం రద్దు చేసుకోవాల్సిందేనని, ఏవైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఎదుర్కొంటుందని తెలిపారు. అవసరమైతే పోలీసులను పెట్టయినా ఆయా కంపెనీల నుంచి పామాయుల్‌ తోటలను స్వాధీనం చేసుకుంటామని, ఇతరులతో పనిచేయిస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.72 లక్షల ఎకరాల్లో 73,696 మంది రైతులు పామాయిల్‌ సాగుచేస్తున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న సీడ్‌ గార్డెన్‌ పనులు వేగవంతం చేయాలని, దేశంలోనే మొట్టడమొదటిదైన సీడ్‌ గార్డెన్‌ నుంచి స్థానిక వాతావరణ పరిస్థితులు తట్టుకునే కొత్త హైబ్రీడ్‌ పామాయిల్‌ మొక్కల ఉత్పత్తి జరుగుతుందని, ఇది రైతులకు లాభదాయకమని, రానున్న రోజుల్లో తెలంగాణ పామాయిల్‌ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 02:58 AM