Tummala Nageswara Rao: పామాయిల్ సాగు లక్ష్యం 10 లక్షల ఎకరాలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:09 AM
రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేట ప్రాంతాలకే పరిమితమైన పామాయిల్ సాగు...
తెలంగాణ ఆయిల్‌ఫెడ్ దీర్ఘకాలిక ప్రణాళిక.. ప్రస్తుతం 2.70 లక్షల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం
నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో దూకుడు.. పామాయిల్ సాగుకు హబ్‌గా తెలంగాణ: మంత్రి తుమ్మల
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేట ప్రాంతాలకే పరిమితమైన పామాయిల్ సాగు... ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం 2.70 లక్షల ఎకరాలకు చేరగా... రాబోయే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామాయుల్ సాగు విస్తీర్ణం పెంపు, ఫ్యాక్టరీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300కోట్లతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేశారు. గంటకు 30 టన్నుల నుంచి 120 టన్నుల పామాయిల్ గెలలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యంతో ఫ్యాక్టరీని నిర్మించారు. ఇక్కడ నూనె గింజల పిప్పి నుంచి బయో పవర్ ప్లాంటును 4మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. తాజాగా మంత్రి తుమ్మల.. ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు మంత్రి తుమ్మల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ హయాంలో సాగుకు శ్రీకారం
పామాయిల్ సాగుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావే తొలుత శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో తొలి మొక్కను నాటించారు. ఆ తర్వాత అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. దీంతో రైతుల్లో ఉత్సాహం పెరిగింది. తుమ్మల ప్రత్యేక శ్రద్ధ, ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఆ ప్రాంత రైతులు పామాయిల్ సాగువైపు మళ్లారు. క్రమక్రమంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 60వేల ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు క్యాబినెట్ ఆమోదం తెలిపేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయిల్‌ఫెడ్‌కు దిశా నిర్దేశం చేస్తూ, రైతులకు అవగాహన కల్పిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు.
టన్ను గెలల ధర రూ.25వేలు ఉండాల్సిందే!
నిరుడు పామాయిల్ గెలల ధర టన్నుకు రూ.24 వేలు పలికింది. దీంతో రైతులకు మంచి ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతిపై సుంకం తగ్గించటంతో పరిస్థితి తారుమారైంది. దేశీయంగా పామాయిల్ గెలల ధరలు తగ్గాయి. దిగుమతి సుంకం పెంచటంతో పాటు సాగు ఖర్చు, నూనె సేకరణ నిష్పత్తి (ఓఈఆర్) ప్రకారం ధరలు ఉండాలని తుమ్మల కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. పామాయిల్ రైతులకు మేలు జరగాలంటే గిట్టుబాటు ధర ఉండాలని, విదేశాల నుంచి దిగుమతి అయ్యే పామాయిల్‌పై సుంకం పెంచాలని కోరారు. టన్ను గెలలకు గిట్టుబాటు ధర రూ.25 వేలు ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
నర్మెట్ట ఫ్యాక్టరీ.. గేమ్ ఛేంజర్: తుమ్మల
పామాయిల్ సాగులో దేశానికి తెలంగాణ హబ్‌గా మారుతుందని మంత్రి తుమ్మల అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 10 లక్షల ఎకరాలకు చేరుతుందన్నారు. పామాయిల్ సాగుతో రైతు రాజుగా మారతాడన్నారు. నర్మెట్ట పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని, దీని ఆధారంగా దేశవ్యాప్తంగా గెలల ధరలు నిర్ణయించే రోజులు వస్తాయని చెప్పారు. నిరుడు దేశవ్యాప్తంగా 1.38 లక్షల కోట్ల విలువైన వంట నూనెలు దిగుమతి చేసుకుంటే.. అందులో 59 శాతం వాటా పామాయిల్‌దేనని తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి పెరగకపోవటంతో 160లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. మన దేశంలో 22 రాష్ట్రాల్లో 27 లక్షల హెక్టార్లలో సాగుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.