Share News

Palamuru Rangareddy Project: పాలమూరుకు ప్యాకేజీ-3 సమస్య

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:43 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్యాకేజీ-3 సమస్యగా మారింది. ప్రభుత్వం అంగీకరించిన మేరకు వెసులుబాటు ఇవ్వడం లేదనే కారణంతో నిర్మాణ సంస్థ....

Palamuru Rangareddy Project: పాలమూరుకు ప్యాకేజీ-3 సమస్య

  • 2 నెలలుగా పనులు నిలిపేసిన కాంట్రాక్టర్‌

  • కాంట్రాక్టర్‌తో ఇరిగేషన్‌ సలహాదారు భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్యాకేజీ-3 సమస్యగా మారింది. ప్రభుత్వం అంగీకరించిన మేరకు వెసులుబాటు ఇవ్వడం లేదనే కారణంతో నిర్మాణ సంస్థ రెండునెలలుగా పనులు ఆపేసింది. పాలమూరు-రంగారెడ్డి పథకంలో తొలి రిజర్వాయర్‌ నార్లాపూర్‌. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించడానికి వీలుగా 8.325 కిలోమీటర్ల మేర ఓపెన్‌ కెనాల్‌ చేపట్టారు. అయితే, ఈపనుల అంచనాలను సవరించాలని గత ప్రభుత్వంలోనే కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి, కాంట్రాక్టర్‌తో పలుమార్లు సమావేశాల అనంతరం ప్యాకేజీ అంచనా వ్యయాన్ని సవరించింది. తొలుత ఈ ప్యాకేజీ అంచనా వ్యయం రూ.416.10 కోట్లు ఉండగా, తర్వాత రూ.780.63 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో కాలువ పనుల్లో గట్టి రాళ్లు వచ్చిన చోట... వాటిని పగులగొట్టి తీసే విషయంలో కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ కోరటంతో ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ, ఈ ఏడాది అక్టోబరు నాటికి పనులు పూర్తిచేస్తామన్న కాంట్రాక్టర్‌.. ప్రభుత్వం అంగీకరించిన మేరకు వెసులుబాటు ఇవ్వలేదని, బిల్లులు చెల్లించలేదని కారణాలు చూపుతూ రెండునెలలుగా పనులు నిలిపివేశారు. దాంతో మంగళవారం కాంట్రాక్టర్‌తో నీటిపారుదలశాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌దాస్‌ సమావేశమై, జూన్‌ లోపు పనులు పూర్తిచేయాలని సూచించారు. అంగీకారం మేరకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని,పనులు పునఃప్రారంభించాలని కోరారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్‌ కోరగా... పనులను పునఃప్రారంభించిన తర్వాత, ఎం-బుక్‌ లో రికార్డు చేసి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. దీంతో పనులను పునఃప్రారంభించేందుకు కాంట్రాక్టర్‌ అంగీకరించినట్లు సమాచారం.

Updated Date - Dec 17 , 2025 | 05:43 AM