BJP Leader DK Aruna: పదేళ్ల పాలనలో ఏం చేశారు?
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:12 AM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు..
పాలమూరు-రంగారెడ్డి డిజైన్లు ఎందుకు మార్చారు?
కేంద్రానికి పూటకో డీపీఆర్ పంపించిన కేసీఆర్ సర్కారు
తప్పుల తడకగా ఉండడంతోసరిచేసుకోమని వెనక్కి
రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పచ్చి అబద్ధాలు
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్: డీకే అరుణ
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం కూడా మరచిపోయి.. రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లాకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. సోమవారం తన నివాసంలో డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లను మీరు ఎందుకు మార్చారు? జూరాల నుంచి నీటిని తీసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్లు సిఫారసు చేసినా, మేము పదే పదే విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు. జూరాల ప్రాజెక్టులో నీళ్లెక్కడ ఉన్నాయని నాడు సీఎంగా మీరు ప్రశ్నించలేదా? కృష్ణా జలాల్లో తెలంగాణకు 535 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా, 299 టీఎంసీలకే అంగీకరించి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సంతకం చేసిన మాట వాస్తవం కాదా?’’ అని నిలదీశారు. ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూటకో డీపీఆర్ పంపించిందన్నారు. అది తప్పుల తడకగా ఉండడంతో సరిచేసి పంపించాలని కేంద్రం సూచించి ఉండవచ్చని పేర్కొన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తిచేయకపోవడం వల్లే కృష్ణా జలాల్లో వాటాను కూడా వినియోగించుకోలేకపోయామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని, బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఆస్తి, కుర్చీ కొట్లాటలతో రోడ్డుపైకి వచ్చి మాట్లాడితే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తుంచుకోవాలన్నారు.