Share News

Authorities Step Up Checks: వేగానికేది కళ్లెం?

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:28 AM

పరిమితికి మించిన వేగం ప్రాణాలు తీస్తోంది. చేవెళ్ల సమీపంలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదానికి కూడా టిప్పర్‌ అతివేగమే కారణమని అధికారుల..

Authorities Step Up Checks: వేగానికేది కళ్లెం?

  • స్పీడ్‌ లాక్‌ లేకుండా దూసుకుపోతున్న భారీ వాహనాలు

  • వాహన వేగం, లోడుపై రవాణా శాఖ ప్రత్యేక నజర్‌

  • కర్నూలు, చేవెళ్ల ప్రమాదాల తర్వాత తనిఖీలు ముమ్మరం

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పరిమితికి మించిన వేగం ప్రాణాలు తీస్తోంది. చేవెళ్ల సమీపంలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదానికి కూడా టిప్పర్‌ అతివేగమే కారణమని అధికారుల విచారణలో తేలింది. ఇదే కాదు భారీ వాహనాలు పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లడంతో గతంలోనూ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు పోయాయి. భారీ వాహనాల వాహన వేగ నియంత్రణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా.. చాలా వరకు అవి అమలు కావడం లేదు. అయితే, చేవెళ్ల, అంతకముందు ఏపీలోని కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో అధికారులు భారీ వాహనాల వేగంతోపాటు ఓవర్‌లోడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం టిప్పర్‌ గరిష్ఠంగా గంటకు 60-80 కిలోమీటర్ల వేగం, లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల గరిష్ఠ వేగం గంటకు 80 కిమీలు, బస్సుల గరిష్ఠ వేగం గంటకు 90 కిమీలు మాత్రమే. అలాగే, ప్రతీ వాహనంలో స్పీడ్‌ గవర్నెన్స్‌ పరికరాలు కచ్చితంగా అమర్చి ఉండాలి. అయితే, చాలా వరకు భారీ వాహనాలు స్పీడ్‌ లాక్‌ లేకుండా పరిమితికి మించిన వేగంతో వెళుతున్నట్టు రవాణా శాఖ అధికారులు ఈ తనిఖీల్లో గుర్తించారు. సగానికిపైగా వాహనాల్లో స్పీడ్‌ గవర్నెన్స్‌ పరికరాలు లేనట్టు కనుగొన్నారు. అలాగే, ఫిట్‌నెస్‌ లేని వాహనాలు, ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న వాహనాలను కూడా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి, వాహన తనిఖీలు అనేది నిరంతర ప్రక్రియ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,15,321 కేసులు నమోదు చేశామని చెప్పారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నాగోల్‌లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో అధిక లోడుతో ప్రయాణిస్తున్న 3 వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. ఓ టిప్పర్‌లో 5.6 టన్నుల ఇసుక, మరో టిప్పర్‌లో 7.5 టన్నుల ఇటుకలు, ఇంకో వాహనంలో 4.2 టన్నుల కంకర తీసుకెళ్తుండగా అడ్డుకున్నామని రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ రమేష్‌ చిదుర తెలిపారు.


స్పీడ్‌ లాక్‌ ఉల్లంఘిస్తే మూడింతల జరిమానా : మంత్రి పొన్నం

అధిక వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని తేలుతున్న నేపథ్యంలో వాహనాలు స్పీడ్‌ లాక్‌ను ఉల్లంఘిస్తే జరిమానా మూడింతలు విధించాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఇసుక, కంకర, డస్ట్‌, ఇటుకలు తరలించే సమయంలో లోడుపై టార్పాలిన్‌ కవర్‌ కప్పాలని అవగాహన కల్పించాలని అధికారులకు సూచించామన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 02:28 AM