Overloaded RTC Bus Catches Fire: ఓవర్‌లోడ్‌తో పల్లెవెలుగు బస్సు టైర్లకు మంటలు?
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:09 AM
జోగులాంబ గద్వాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మానవపాడు మండలంలోని మద్దూరు వద్ద గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మంట లు వ్యాపించాయి...
గమనించి చెప్పిన వాహనదారులు
గద్వాల జిల్లాలో తప్పిన ప్రమాదం
బస్సులో 96 మంది ప్రయాణం
బస్సు సామర్థ్యం 55 మందేనన్న డ్రైవర్
మానవపాడు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మానవపాడు మండలంలోని మద్దూరు వద్ద గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మంట లు వ్యాపించాయి. మద్దూరు బస్టాపు వద్ద ఉన్న ప్రయాణికులు, ఇతర వాహనదారులు బస్సు డ్రైవర్ సత్యారెడ్డిని అప్రమత్తం చేయడంతో అతడువెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులంతా భయంతో అరుస్తూ వేగంగా కిందికి దిగిపోయారు. దీంతో, ప్రమాదం తప్పిపోయింది. ఈ సమయంలో బస్సులో 96మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు సామర్థ్యం 55 మాత్రమే కాగా, 96 మంది ఎక్కారని, ఓవర్ లోడ్ కారణంగా లైనర్లు, టైర్లు వేడి కావడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్ సత్యారెడ్డి చెప్పాడు. గద్వాల డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గద్వాల నుంచి ఉదయం 7:30 గంటలకు కర్నూలుకు బయలుదేరింది. బస్సు మద్దూరు స్టేజీ సమీపంలోకి వస్తుండగా బస్సులోకి పొగలు వచ్చా యి. అదేసమయంలో మద్దూరు స్టేజీ వద్ద ప్రయాణికులు, గ్రామస్థులు, వాహనదారులు బస్సు టైర్ల వద్ద మంటలు అంటుకున్న విషయాన్ని గమనించి డ్రైవర్‌కు చెప్పారు. దీంతో, డ్రైవర్ బన్సును ఆపి, స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశాడు. శాంతినగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను ఇతర బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు.