Dr Nageswar Reddy: విద్యార్థులకు అనేక సవాళ్లు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:13 AM
బయట ప్రపంచంలోకి అడుగుపెట్టే విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయని.. వాటిని ఎదిరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు..
ఎదిరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు
లఖ్‌నవూలోని ఎస్‌జీపీజీఐఎంఎస్ స్నాతకోత్సవంలో ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సూచన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): బయట ప్రపంచంలోకి అడుగుపెట్టే విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయని.. వాటిని ఎదిరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్, ప్రొఫెసర్ డి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌సలో మంగళవారం నిర్వహించిన 29వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెసిడెంట్‌గా తన శిక్షణ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌సలో చేరానని.. ఆ సమయంలో ఒక యూరోపియన్ సదస్సులో ఒక సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్.. ‘‘నువ్వు ఎండోస్కోపీ చేస్తే టెక్నీషియన్‌లా మారిపోతావు’’ అని తనతో అన్నారని గుర్తుచేసుకున్నారు. ‘‘కానీ నా గురువు డాక్టర్ జంగ్ దిలావారి ప్రేరణతో, నేను థెరప్యూటిక్ ఎండోస్కోపీని నా జీవిత లక్ష్యంగా స్వీకరించాను’’ అని తెలిపారు. ‘నువ్వు సమాజం కోసం ఏం చేశావు? ఏదైనా పరిశోధన చేశావా? ఎవరికైనా శిక్షణ ఇచ్చావా?’ అని ఒకరోజు తన తండ్రి ప్రశ్నించారని.. ఆయన ప్రశ్నలు తన జీవితాన్ని మలుపుతిప్పాయని చెప్పారు. అప్పుడే తాను కొద్దిమంది మిత్రులతో కలిసి ‘ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ని ప్రారంభించానని వెల్లడించారు. ప్రస్తుతం అది 1000 పడకల ఆసుపత్రిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎండోస్కోపీ యూనిట్‌గా, ప్రత్యేకమైన పరిశోధనా విభాగంతో, గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించే అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ తదితరులు పాల్గొన్నారు.