Lok Adalat: లోక్ అదాలత్‌లో సైబర్ క్రైం బాధితులకు రూ.40.8 కోట్లు రీఫండ్
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:41 AM
మూడో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో రాష్ట్రంలోని 7,040 మంది సైబర్ క్రైం బాధితులకు రూ.40.8 కోట్లు రీఫండ్ చేశామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు....
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మూడో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో రాష్ట్రంలోని 7,040 మంది సైబర్ క్రైం బాధితులకు రూ.40.8 కోట్లు రీఫండ్ చేశామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. శనివారం రూ.12.95 కోట్లు, ఈ నెల రెండో తేదీ నుంచి రూ.27.91 కోట్లు రీఫండ్ చేశామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన 3 లోక్ అదాలత్‌లలో 18,872 మంది బాధితులకు రూ.138.04 కోట్లు రీఫండ్ చేశామన్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సైబర్ క్రైం బాధితులకు రూ.321 కోట్లు రీఫండ్ జరిగిందని ఆమె వివరించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేస్తే, అంతే త్వరగా పోయిన డబ్బును రాబట్టే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కాగా, ఈ లోక్ అదాలత్‌తో 1,65,522 కేసులు పరిష్కరించామని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. ఈ నెల రెండో తేదీ నుంచి 13 వరకూ జరిగిన కేసుల పరిష్కారంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 29,023, రాచకొండ కమిషనరేట్‌లో 22,278, నల్లగొండలో 14,002 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. వాటిలో 20,964 ఎఫ్‌ఐఆర్ కేసులు, 883 డిజాస్టర్ మేనెజ్‌మెంట్, 75,430 ఈ పెట్టి, 61,205 ఎంవీ యాక్ట్, 7,040 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించామన్నారు.