Share News

Panchayat Elections: 4,332 స్థానాలకు 17వేలకు పైగా నామినేషన్లు

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:01 AM

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో పూర్తయింది....

Panchayat Elections: 4,332 స్థానాలకు 17వేలకు పైగా నామినేషన్లు

  • ముగిసిన రెండోవిడత నామినేషన్ల స్వీకరణ.. కొనసాగుతున్న ఏకగ్రీవాలు

  • గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామన్న వాళ్లకి పదవులు

  • నేటి నుంచి మూడో విడత ఎన్నికలకు నామినేషన్లు

హైదరాబాద్‌/గుర్రంపోడు/సంగారెడ్డి/నంగునూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో పూర్తయింది. రెండో విడతలో ఈ నెల 14న పోలింగ్‌ జరగనున్న 4,332 సర్పంచ్‌ స్థానాలకు 17వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 2,975మంది, రెండో రోజు 9,503, మూడో రోజు 5వేల పైచిలుకు మంది నామినేషన్లు సమర్పించారు. అలాగే, 38,342 వార్డు సభ్యుల స్థానాలకు మొదటి రోజు 3,608 మంది, రెండో రోజు 26, 438మంది నామినేషన్లు వేశారు. చివరి రోజు కు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. మరోపక్క, ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. గ్రామాభివృద్ధికో, ఆలయాల నిర్మాణానికో నిధులు ఇస్తామన్న వారికి సర్పంచ్‌ పదవులు సొంతమవుతున్నాయి. నల్లగొండ జిల్లాల్లో రెండు పంచాయతీలు, సంగారెడ్డి జిల్లాలో ఐదు పంచాయతీలు మంగళవారం ఏకగ్రీవం అయ్యాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని బుడ్డరెడ్డిగూడెం సర్పంచ్‌గా సింగం బాలకృష్ణను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుడ్డరెడ్డిగూడెం, బోడపాడు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.25.20లక్షలు ఖర్చు చేస్తానని బాలకృష్ణ హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. అలాగే, గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.10లక్షలు ఖర్చు చేస్తానని ముందుకు రావడంతో వాడపల్లి వెంకన్న అనే వ్యక్తిని యలమోనిగూడెం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం కుసునూరు, కౌడిపల్లి మండలం కుషాన్‌గడ్డ తండా, ధర్మసాగర్‌ గేట్‌ తండా, పీర్ల తండా, సిర్గాపూర్‌ మండల పరిధి సర్పంచ్‌ తండా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కుసునూరు సర్పంచ్‌గా రాజశేఖర్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌గా జయపాల్‌ రెడ్డిని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ భవనం కోసం ఐదు గుంటల భూమి ఇస్తానని హామీ ఇవ్వడంతో కుషాన్‌గడ్డ తండా సర్పంచ్‌ పదవి రాజుకు దక్కింది. ధర్మసాగర్‌ గేట్‌ తండాలో రూ. 7 లక్షలు, పీర్ల తండాలో రూ. 10 లక్షలు గ్రామాభివృద్ధికి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి మద్దతు ఇచ్చారు.


నేటినుంచి మూడోవిడత నామినేషన్లు

మూడోవిడత ఎన్నికల్లో భాగంగా 4,159 సర్పంచ్‌, 36,452 వార్డుసభ్యుల స్థానాలకు ఈనెల 17న, పోలింగ్‌ .జరగనుంది. ఇందుకు గాను నేటి (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈనెల 5 నామినేషన్ల దాఖలుకు చివరి తేది. కాగా వాటి పరిశీలన 6న, అభ్యంతరాల స్వీకరణ/పరిష్కారం 7, 8తేదీల్లో చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక 9న పోటీలోఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. ఇక, ఈనెల 11న పోలింగ్‌ జరగనున్న తొలివిడత ఎన్నికలకోసం నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగానే.. పోటీలోఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల విభాగాలు బుధవారం ప్రకటించనున్నాయి.

అన్న మద్దతివ్వడంలేదని తమ్ముడి ఆత్మహత్యాయత్నం

సర్పంచ్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తనకు తోడబుట్టిన అన్న మద్దతు ఇవ్వడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్‌ గ్రామ సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసిన గణపురం ఎల్లయ్య ఈ పని చేశారు. గ్రామ మాజీ ఉపసర్పంచ్‌ అయిన ఎల్లయ్య ప్రచారంలో భాగంగా తన అన్న, మాజీ సర్పంచ్‌ బాల్‌ నరసయ్యను కలిసి మద్దతు కోరాడు. నేను వేరే వాళ్లకు మాటిచ్చా నువ్వు పోటీ నుంచి తప్పుకోరా.. అని అన్న నరసయ్య చెప్పడంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య గడ్డి మందు తాగి చివరికి ఆస్పత్రి పాలయ్యాడు..

అన్నదమ్ముల సవాల్‌

వారిద్దరిది ఒకే రక్తం, ఒకే పార్టీ.. కానీ సర్పంచ్‌ పదవి కోసం ప్రత్యర్థులుగా మారారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం పులిమామిడి సర్పంచ్‌ స్థానానికి నెల్లూరి సిద్దరాములు, నెల్లూరి దాసు అనే సొంత అన్నదమ్ములు మంగళవారం నామినేషన్లు వేసి స్థానికంగా చర్చకు తెరలేపారు. - చేగుంట

సారూ.. ఈ ఒక్కటి తీసుకొండి

ఈ ఫొటోలో పోలీసు కానిస్టేబుల్‌తో మాట్లాడుతున్న వ్యక్తి పేరు గొల్ల కిష్టయ్య. తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన కిష్టయ్య వార్డు సభ్యుడిగా పోటీ చేయాలని ఆలస్యంగా నిర్ణయించుకున్నాడు. నామినేషన్‌ దాఖలుకు మంగళవారం చివరి రోజు కాగా.. మరో రెండు నిమిషాల్లో గడువు ముగుస్తుందనగా తూప్రాన్‌లోని ఐడీవోసి భవనానికి వెళ్లాడు. ఎలాగోలో దరఖాస్తు సంపాదించి పూర్తి చేశాడు. కానీ టైమ్‌ అయిపోయిందని అధికారులు కౌంటర్లు మూసేశారు. దీంతో సార్‌... ఈ ఒక్కటి తీసుకోండి.. అంటూ కిష్టయ్య కనిపించిన ప్రతీ అధికారిని వేడుకున్నాడు. కానీ నిరాశే మిగిలింది.

- తూప్రాన్‌

Updated Date - Dec 03 , 2025 | 04:01 AM