Share News

Road Accident: అదుపుతప్పి బైకులను ఢీకొన్న లారీ

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:21 AM

ఓ మినీ లారీ కంటైనర్‌ డ్రైవర్‌ మితిమీరిన వేగం, ఓ యువకుడి నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలు తీసుకుంది. నెల్లూరులోని జాతీయ రహదారిపై స్థానిక ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద అతి వేగంగా వస్తున్న లారీ యూటర్న్‌.....

Road Accident: అదుపుతప్పి బైకులను ఢీకొన్న లారీ

  • ముగ్గురి మృతి, నలుగురికి గాయాలు

  • ఏపీలోని నెల్లూరులో ఘటన

నెల్లూరు(క్రైం)/విజయవాడ/రేణిగుంట, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఓ మినీ లారీ కంటైనర్‌ డ్రైవర్‌ మితిమీరిన వేగం, ఓ యువకుడి నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలు తీసుకుంది. నెల్లూరులోని జాతీయ రహదారిపై స్థానిక ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద అతి వేగంగా వస్తున్న లారీ యూటర్న్‌ తీసుకుంటున్న బైకర్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చేపలు అన్‌లోడ్‌ చేసిన మినీ లారీ కంటైనర్‌ నెల్లూరుకు బయలుదేరింది. నెల్లూరు ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానం సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న ఓ యువకుడు బైక్‌ను యూటర్న్‌ తీసుకోవడంతో.. లారీ డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించలేక ఆ బైక్‌ను ఢీకొట్టాడు. అంతేకాక మరో రెండు బైక్‌లను ఢీకొట్టి, రోడ్డుపక్కన ఉన్న చిరువ్యాపారులపైకి దూసుకెళ్లి, ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న అల్లీపురంలోని సిరిగార్డెన్‌కు చెందిన తండ్రి కుమారులైన రిటైర్డ్‌ పీఈటీ షేక్‌ ఖాజానాజీం మొహిద్దీన్‌(70), సచివాలయ ఉద్యోగి ముజాహీద్‌ ఆలీ(35)తో పాటు ఏ.సురేష్‌(35) అనే వ్యక్తి మృతిచెందారు. రోడ్డుపక్కనే చిరువ్యాపారం చేసుకుంటున్న మంజుల, మాలకొండయ్యతో పాటు అనీల్‌, కోటి అనే మరో ఇద్దరు గాయపడ్డారు. వీరు నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 03:21 AM