Origin of Employment Guarantee: ఉపాధికి బీజం మెదక్‌లోనే
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:33 AM
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం, దీంతో ఉపాధి పనులే పూర్తిగా నిలిచిపోతాయన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో..
2000లో దేశంలో కరువు తాండవం.. మెదక్ జిల్లా గుట్టకింద పల్లెలో మానవహక్కుల సంఘం నేతల పర్యటన
ప్రజలకు తిండిలేక వలస వెళ్లడంపై ఆవేదన
ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో గ్రామంలో రొట్టె, పప్పు పంపిణీ
ఆ స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ పంపిణీ
ఆ తర్వాతే ఉపాధి హామీ పథకానికి రూపకల్పన.. దేశ వ్యాప్తంగా అమలు
కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో పథకం నిలిచిపోతుందన్న ఆందోళనలో కూలీలు
మెదక్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం, దీంతో ఉపాధి పనులే పూర్తిగా నిలిచిపోతాయన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. అసలు నరేగాను ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారన్న చర్చ మొదలైంది. అయితే ఇన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా అమలైన ఈ పథకానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడింది. 2000 సంవత్సరంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు నెలకొని.. గ్రామాల్లో ఉపాధి కరువై.. ప్రజలు పొట్ట చేతపట్టుకుని వలసబాట పట్టారు. ఊళ్లకు ఊళ్లే పట్టణాలకు వలస వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లా గుట్టకింద పల్లె గ్రామాన్ని మానవ హక్కుల సంఘం నేతలు బాలగోపాల్, దివంగత ఫ్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు సందర్శించారు. ఆ గ్రామంలో సుమారు మూడొంతుల కుటుంబాలు తిండిలేక ఉపాధి కోసం ఇళ్లకు తాళాలు వేసి పట్నం బాట పట్టడాన్ని చూసి చలించిపోయారు. దాంతో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో ఆ గ్రామంలో రొట్టె, పప్పు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటి ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు కొండల్‌రెడ్డి తదితరులు సుమారు 40 రోజులపాటు దానిని అమలు జరిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కరువు పీడిత గ్రామాల్లో ఈ బృందం రొట్టె, పప్పు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అదే సమయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ కరువు పీడిత ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికీ కనీసం వంద రోజుల పాటు పని కల్పించాలని, లేని పక్షంలో ప్రభుత్వమే కూలి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. 2005లో అప్పటి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన వామపక్ష మేధావులు జరిపిన అనేక చర్చల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లు పెట్టింది. నిరుపేదలకు పని కల్పించడంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. ఆ కమిటీ దేశ వ్యాప్తంగా పర్యటించి పలువురు మేధావుల అభిప్రాయాలు, సూచనలు సేకరించింది. ఫలితంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాలని చట్టం చేసింది. ఆ తర్వాత రాష్ట్రాలు 25 శాతం మేర చెల్లిస్తున్నాయి. పేదలకు పని కల్పించడం ద్వారా.. వారు వలస వెళ్లకుండా నివారిస్తూ వచ్చాయి.
కొత్త చట్టంపై ఆందోళన..
ప్రస్తుతం కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేయడమే కాకుండా.. పాత హక్కు మార్గదర్శకాలను తీసివేసిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం వీబీ జీరామ్‌జీ యాక్ట్ 2025 రాబోతోంది. పని అనేది డిమాండ్ మేరకు కాకుండా.. కేంద్రం నిర్దేశించిన బడ్జెట్ ప్రాంతాలకే పరిమితం కానుంది. కేంద్రం కూలీలకు కల్పిస్తున్న ఉపాధిలో 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రం 40 శాతం నిధులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఏ రాష్ట్రం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని భరించలేవని అంటున్నారు. అంతేకాకుండా.. ఏ రాష్ట్రం ఎంత మేరకు నిఽఽధులు ఇవ్వాలనేది కేంద్రమే నిర్ణయిస్తుందని పేర్కొంటున్నారు. కాగా, వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంచుతామంటూనే.. డబ్బులు మాత్రం పరిమితంగా ఇస్తామనడం కేంద్రానికి న్యాయ సమ్మతం కాదని ప్రొఫెసర్ కోదండరాం ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఈ మార్పులు రాష్ట్రాలపై, ప్రధానంగా ఆర్థికంగా వెనకబాటుకు గురైన తెలంగాణ వంటి రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని పెంచుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలపై ఆధారపడి పథకం అమలు ఉంటుందన్నారు. దీంతో ఇంతకాలం ఉపాధి పని విషయంలో ధీమాగా ఉన్న కూలీలు.. భయాందోళనకు గురవుతున్నారు. ఇన్నాళ్లుగా తమకు అండగా ఉన్న ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.
ఉద్యోగులకు ముప్పు!
సంక్షేమ పథకాల భారం మోస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అమలు చేయలేని నిస్సహాయ సిఽ్థతిలో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రం తన వాటాను సమయానికి విడుదల చేయలేకపోతే పనుల మంజూరు నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నరేగాలో రాష్ట్రంలో ఏపీవోలు 392 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 289 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 870, జిల్లా అదనపు రీసోర్స్ పర్సన్‌లు 14, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు 8, టెక్నికల్ అసిస్టెంట్లు 2028తో కలిపి మొత్తం 3,794 మంది వివిధ హోదాల్లో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. వీరంతా రానున్న రోజుల్లో తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.4,341 కోట్ల వ్యయం చేయగా, అందులో కూలీలకు చెల్లించిన మొత్తం రూ.2,610 కోట్లు. ఇక మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చులు రూ.1500 కోట్లు, పరిపాలనా వ్యయం రూ.229 కోట్లు వెచ్చించినట్లు అధికారిక రికార్డులు తెలుపుతున్నాయి.