kumaram bheem asifabad- ఆశావహుల చూపు.. రిజర్వేషన్ల వైపు
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:17 PM
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతుండడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మారుతోంది. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్లు కలిపి 50శాతం వరకు ఉండేవి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ ఉంది.
బెజ్జూరు/కాగజ్‌నగర్‌టౌన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతుండడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మారుతోంది. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్లు కలిపి 50శాతం వరకు ఉండేవి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆశావహులు మాత్రం ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
స్పష్టత లేక ఉత్కంఠ...
పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు పంచాయతీరాజ్ చట్టం 2018ప్రకారం గతంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీని ప్రకారం వరుసగా రెండు దఫాలు ఒకేలా రిజర్వేషన్ అమలు చేసేలా చట్టం చేశారు. గత ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని సవరిస్తూ గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసింది. ఈ చట్ట సవరణ బిల్లు-2024కు అసెంబ్లీ ఆమోదం లభించింది. దీని ప్రకారం స్థానిక సంస్థల్లో ఒకే దఫా మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. దీంతో ఈసారి మళ్లీ అన్ని స్థానాలకు రిజర్వేషన్లు పూర్తిగా మారనున్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రిజర్వేషన్ మారుతుందా? కొత్త రిజర్వేషన్ వస్తే ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారనే విషయమై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
మద్దతుపై దృష్టి...
మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, 30రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్థానిక రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆశావహులు, ప్రధాన పార్టీల మద్దతుపై దృష్టి సారించారు. మూడు నెలల్లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో నలుగురు ఉన్నచోట రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయో, తమకు అనుకూలంగా ఉంటుందో లేదోనని చర్చించుకుంటున్నారు. స్థానిక సమరం ఇప్పటికే ఆలస్యం కావడం.. ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావడంతో ఆశావహులు సైతం తమ మద్దతుదారులను ఇప్పటి నుంచే మచ్చిక చేసుకుంటున్నారు.
జిల్లాలో మొత్తం ఓటర్లు- 3,48,368
మహిళలు- 1,74,297
పురుషులు- 174055
ఇతరులు- 16
జిల్లాలో మొత్తం మండలాలు-15
గ్రామపంచాతీలు-334
జడ్పీటీసీ స్థానాలు-15
ఎంపీపీలు -15
ఎంపీటీసీ స్థానాలు- 123