Share News

Lift Collapse: ఓపెన్‌ లిఫ్ట్‌ కూలి.. ఒకరి మృతి

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:24 AM

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. బోధనాస్పత్రి మరమ్మతు పనుల్లో భాగంగా గోడలకు ఉన్న గ్రానైట్‌ టైల్స్‌ను తొలగించి కిందకు తీసుకొస్తున్న ఓపెన్‌ లిఫ్ట్‌ ఆరో అంతస్తు నుంచి తెగి కిందపడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..

Lift Collapse: ఓపెన్‌ లిఫ్ట్‌ కూలి.. ఒకరి మృతి

  • ఇద్దరి పరిస్థితి విషమం.. ఆరో అంతస్తు నుంచి గ్రానైట్‌ రాళ్లు కిందకు తెస్తుండగా తెగిపడిన లిఫ్ట్‌

  • సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో ఘటన

  • ప్రమాద ఘటన బాధాకరం: మంత్రి రాజనర్సింహ

అమీర్‌పేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. బోధనాస్పత్రి మరమ్మతు పనుల్లో భాగంగా గోడలకు ఉన్న గ్రానైట్‌ టైల్స్‌ను తొలగించి కిందకు తీసుకొస్తున్న ఓపెన్‌ లిఫ్ట్‌ ఆరో అంతస్తు నుంచి తెగి కిందపడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి డీన్‌ శిరీ్‌షకుమార్‌ వెల్లడించారు. ఈఎ్‌సఐ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రి గోడలకు ఉన్న పాత టైల్స్‌ తొలగించి కొత్తవి అమర్చే పనులను ఈఎ్‌సఐ కార్పొరేషన్‌కు చెందిన సీసీడబ్ల్యూ విభాగం చేస్తోంది. ఈ పనుల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో బోధనాస్పత్రి ఆరో అంతస్తు గోడలకున్న టైల్స్‌ను తొలగించి ఓపెన్‌ లిఫ్ట్‌ ద్వారా కిందకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌ తీగలు తెగిపోయి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్‌ సూపర్‌వైజర్‌ భానుచందర్‌(24) దానిపై ఉండగా.. కింద రఘుపతి, మోహన్‌, మల్లేశ్‌, మైసయ్య అనే కార్మికులు ఉన్నారు. భానుచందర్‌పై గ్రానైట్‌ రాళ్లు పడడంతో అక్కడికక్కడే మరణించాడు. నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న మోహన్‌, రఘుపతిలకు ఈఎ్‌సఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరికి అత్యవసర విభాగంలో చికిత్స చేస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని డీన్‌ శిరీ్‌షకుమార్‌ వెల్లడించారు. క్షతగాత్రుల పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మెరుగైన చికిత్స అందించండి: రాజనర్సింహ

ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Nov 25 , 2025 | 04:24 AM