Share News

53మందికి ఇద్దరే టీచర్లు..!

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:59 AM

నార్కట్‌పల్లి మండల కేంద్రానికి శివారులో ఉన్న లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల అసౌకర్యాల నడుమ నడుస్తోంది. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సమతుల్యత లోపించింది.

 53మందికి ఇద్దరే టీచర్లు..!
ఒకే గదిలో కూర్చున్న ఐదు తరగతుల విద్యార్థులు

53మందికి ఇద్దరే టీచర్లు..!

లక్ష్మీపురం పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులు

ఒకే గదిలో ఐదు తరగతులు

అసౌకర్యాల నడుమ పాఠాలు

అసంపూర్తిగా మూత్రశాలలు

నార్కట్‌పల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండల కేంద్రానికి శివారులో ఉన్న లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల అసౌకర్యాల నడుమ నడుస్తోంది. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సమతుల్యత లోపించింది. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేని పరిస్థితి ఉంటే ఈ పాఠశాలలో మాత్రం విద్యార్థులున్నా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఐదు తరగతులను కలిపి ఒకే గదిలో నిర్వహిస్తూ ఉపాధ్యాయునులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాలలో మొత్తం 53 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో బాలురు 28, బాలికలు 25 మంది ఉన్నారు. తరగతుల వారీగా పరిశీలిస్తే 1వ తరగతిలో 20, 2వ తరగతిలో 7 గురు, 3వ తరగతిలో 5 గురు, 4వ తరగతిలో 10 మంది, 5వ తరగతిలో 11 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా కొంత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంది.

ఒకే గదిలో 5 తరగతులు

లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకు కేవలం ఒక్కటే తరగతి గది ఉంది. అందులోనే విద్యార్థులను కూర్చోబెట్టి ఐదు తరగతులకు పాఠాలు చెబుతున్నారు. దీంతో అన్ని తరగతులకు ఒకే గదిలో చెప్పాల్సి వస్తుండటంతో విద్యార్థుల్లో ఏకాగ్రత కొరవడుతోంది. ఉపాధ్యాయులకు కూడా కొంత అసౌకర్యంగానే ఉంది. అదనపు తరగతి గది కోసం మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సీడీపీ కోటా కింద రూ.17 లక్షల అంచనా విలువతో 18 నవంబరు 2024లో ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. కానీ కారణమేంటో తెలియకున్నా నేటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

మూత్రశాలలకు తలుపుల్లేవు

అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ.1.30 లక్ష ల అంచనాతో పనులు చేపటా రు. ఇందులో భాగంగా మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించారు. కానీ తలుపులు బిగించలే దు,నీటి కనెక్షన ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తుంది. నిర్మాణం చేసి న మొత్తానికి సంబంధించిన డబ్బులు రాకపోవడంతోనే పనులను అసంపూర్తిగా నిలిపివేసినట్లు తెలిసింది. నీటి ట్యాంకు కట్టాల్సి ఉండగా కట్టలేదు.

టీచరును డిప్యూటేషన చేస్తాం

లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు గుర్తించాం. గతేడాది కన్న విద్యార్థుల సంఖ్య దాదాపు 20 వరకు పెరిగి ప్రస్తుతానికి 53 మంది ఉన్నారు. సమస్య నా దృష్టికి వచ్చింది. తుర్కబావిగూడెం పాఠశాలలో జీరో ఎనరోల్‌మెంట్‌ ఉంది. అక్కడి నుంచి ఉపాధ్యాయురాలిని ఈ పాఠశాలకు డిప్యూటేషన చేస్తాం.

- కూకుట్ల నర్సింహ, ఎంఈవో, నార్కట్‌పల్లి

Updated Date - Jul 26 , 2025 | 12:59 AM