Share News

Online Betting Scam: బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం.. నలుగురి అరెస్టు

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:24 AM

టెలిగ్రామ్‌ యాప్‌లోని చానల్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెబ్‌సైట్లకు ప్రచారం చేసి కమీషన్ల రూపంలో రూ.2 కోట్లు దాకా పొందిన నలుగురిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

Online Betting Scam: బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం.. నలుగురి అరెస్టు

  • మరో ముగ్గురి కోసం గాలింపు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): టెలిగ్రామ్‌ యాప్‌లోని చానల్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెబ్‌సైట్లకు ప్రచారం చేసి కమీషన్ల రూపంలో రూ.2 కోట్లు దాకా పొందిన నలుగురిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. వివరాలను డీసీపీ స్పెషల్‌ బ్రాంచ్‌, సైబర్‌ క్రైం విభాగం ఇన్‌ఛార్జి బి.సాయిశ్రీ విలేకరులకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నంశెట్టి నాగ రాకేష్‌, పొట్టావత్తిని దీపక్‌, గుగులోత్‌ శ్రీరాం నాయక్‌, హేమంత్‌ కుమార్‌.. బీటెక్‌ చదివిన విద్యావంతులు. ఐసీసీ క్రికెట్‌ రిపోర్ట్స్‌, ఐసీసీ టాస్‌, హనుమాన్‌, ది మార్స్‌ టాస్‌, మార్స్‌ లైన్‌, మ్యాజికల్‌ మార్స్‌, సహరా, సహరా టాస్‌, ఐసీసీ క్రికెట్‌ గ్రౌండ్‌ రిపోర్టు తదితర పేర్లతో వీరంతా టెలిగ్రామ్‌లో చానల్స్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కో చానల్‌కు 10వేల నుంచి 80వేల మంది వరకు ఫాలోవర్ల ఉన్నారు. ఆ చానల్స్‌లో స్టేక్‌ ఐడీ, లోట్‌సప్లే, రాయల్‌బుక్‌365, గోవిందా365, వీఐపీ బుక్‌, ఫెయిర్‌ప్లే, లోటస్‌ ఎక్స్‌చేంజ్‌, విన్‌ బజ్‌, అల్ర్టావిన్‌, అల్ర్టావిన్‌ డాట్‌ గేమ్స్‌ తదితర బెట్టింగ్‌ వెబ్‌సైట్లకు ప్రచారం చేసేవారు. వీరిని నమ్మి ఎవరైనా బెట్టింగ్‌ ఆడితే.. ఆయా వెబ్‌సైట్లు వీరికి కమీషన్‌ రూపంలో భారీగా డబ్బు చెల్లించేవి. ఇలా, 60వేల మంది ఫాలోవర్లు కలిగిన చిన్నంశెట్టి నాగరాకేష్‌ రూ.1.7 కోట్లు కమీషన్‌గా పొందాడు. 80 వేల మంది ఫాలోవర్లు కలిగిన దీపక్‌ రూ.55 లక్షలు, 19వేల మంది ఫాలోవర్లు కలిగిన శ్రీరాంనాయక్‌ రూ.30 లక్షలు, 10వేల మంది ఫాలోవర్లు కలిగిన హేమంత్‌ రూ.30 లక్షలు దాకా కమీషన్‌గా సంపాదించారు. నిందితుల వద్ద రెండు ల్యాప్‌టా్‌పలు, 10 స్మార్ట్‌ ఫోన్లు, 5 ఏటీఎం కార్డులు, 9 బ్యాంకు పాస్‌ పుస్తకాలు, రెండు చెక్‌ పుస్తకాలు, ఓ పాన్‌కార్డును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు.

Updated Date - Jun 25 , 2025 | 07:25 AM