Onion Laden Lorry Tips: ఉల్లి లారీ బోల్తా.. బస్తాలు ఎత్తుకెళ్లిన స్థానికులు!
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:29 AM
అకస్మాత్తుగా అడ్డుగా వచ్చిన పాఠశాల బస్సును తప్పించే క్రమంలో ఉల్లిగడ్డల లోడు లారీ బోల్తా పడడంతో స్థానికులు కొన్ని బస్తాలను ఎత్తుకెళ్లిపోయారు...
పాఠశాల బస్సును తప్పించే క్రమంలో ఘటన
విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. నల్లగొండ జిల్లా లో ఘటన
నార్కట్‌పల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అకస్మాత్తుగా అడ్డుగా వచ్చిన పాఠశాల బస్సును తప్పించే క్రమంలో ఉల్లిగడ్డల లోడు లారీ బోల్తా పడడంతో స్థానికులు కొన్ని బస్తాలను ఎత్తుకెళ్లిపోయారు. సోమవారం ఉదయం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ లింగోటం శివారులో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర నుంచి 30 టన్నుల ఉల్లిగడ్డ లోడుతో ఓ లారీ ఏపీలోని కృష్ణాజిల్లా విజయవాడకు వెళ్తోంది. ఏపీలింగోటం శివారుకు చేరుకోగానే నార్కట్‌పల్లి శ్రీ విద్యాపీఠ్ పాఠశాలకు చెందిన బస్సు లారీని గమనించకుండా హైవేపై యూట ర్న్ చేసుకుంటోంది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే ఎడమ వైపు తిప్పడంతో అదుపుతప్పి హైవే కిందకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. బోల్తా పడిన లారీ నుంచి కొన్ని ఉల్లిగడ్డ బస్తాలను బాటసారులు లూటీ చేశారు. రోడ్డు కింద నుంచి రోడ్డుపైకి బస్తాలను మోసుకుని వచ్చి వాహనాల్లోకి వేసుకుని తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో స్కూలు బస్సులో 12 మంది విద్యార్థులు ఉండగా, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.