kumaram bheem asifabad- ఒకే ఓటరు.. రెండు రాష్ట్రాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:21 PM
కుమ రం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటుమహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావే నంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీ గా ఇక్కడ పాలన చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ మరోసారి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఉన్న తెలంగాణ - మహరాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాలు తెరపైకి వచ్చాయి
- ఆరు వేల జనాభా, 3,150 మంది ఓటర్లు
- 35 ఏళ్లుగా తెగని పంచాయతీ
ఆసిఫాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కుమ రం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటుమహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావే నంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీ గా ఇక్కడ పాలన చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ మరోసారి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఉన్న తెలంగాణ - మహరాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాలు తెరపైకి వచ్చాయి. రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఇంటింటికీ రేషన్ కార్డులు ఇచ్చాయి. రేషన్ షాపులూ ఏర్పాటు చేశాయి. రెండు ప్రభుత్వాలు పాఠశాలలను ఏర్పాటు చేశాయి. ఇక్కడ రెండు ప్ర భుత్వాలకు సంబంధించిన ఓటరు ఐడీ కార్డులను ఓటర్లు పొంది ఉన్నారు. ఆ గ్రామాల నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఫ ఈ గ్రామాల పరిధిలో 11న పోలింగ్..
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్ప దంగా ఉన్న 12 గ్రామాల్లో ఈనెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఉన్న పరందోళి, ముఖద్దంగూడ, అంతాపూర్, బోలాప టార్ పంచాయతీల పరిధిలోని 12 సరిహద్దు వివాదాస్పద గ్రామాలు ఉన్నాయి. పరందోళి పంచాయతీ పరిదిలో పరందోళి, కోటా, శంకర్‌లోద్ది, ముఖద్దంగూడ పంచాయతీ పరిధిలో మహారాజ్ గూడ, ముఖద్దంగూడ, అంతాపూర్ పంచాయతీ పరిధిలో అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, బోలాపటార్ పంచాయతీ పరిధిలో బోలాపటార్, లెండిగూడ, గౌరి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఆరువేల పై చిలుకు జనాభా ఉంది. ఇందులో 3,150 ఓటర్లు ఉన్నారు. ఏ పంచాయతీకైనా ఒకే సర్పంచ్ ఉంటారు కానీ ఈ వివాదాస్పద గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌ులు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఇక్కడి ఓటర్లకు ఇటూ తెలంగాణ అటూ మహారా ష్ట్ర ఎన్నికల్లో ఓటు హక్కు, పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రామాల వివాదం సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు సూచనల మేరకు సరిహద్దు వివాదం పరిష్కారమ య్యే వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు రెండు రాష్ట్రాల్లోను ఓట్లు వేసేలా అవకాశం కల్పించారు. ఈ మేరకు వారికి రెండు రాష్ట్రాల ఓటరు కార్డులు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో ఈనెల 11న పోలింగ్ జరుగనుండగా బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఫ ఆ గ్రామాల్లో అన్నీ డబుల్ ధమాకే..
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వివాదస్పందంగా మారిన ఆ 12 గ్రామాల ప్రజలకు అన్నీ డబుల్ ధమాకే. రెండురెండే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మొదలుకుని పాఠశాలలు, రహదారులు, తాగు నీటి పథకాల వరకు అన్ని రెండు మంజూరు చేస్తూ వస్తున్నాయి. ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు, రెండు పాఠశాలలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్లుగా అటెండర్‌ను మొదలుకుని ఐఏఎస్ దాకా అన్నీ డబుల్ దమాకే. ఆ ఊర్లలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా విచిత్రమేమిటంటే తెలంగాణ నుంచి సర్పంచ్‌గా పని చేసిన వ్యక్తే మహారాష్ట్ర ఎన్నికలు రాగానే ప్లేట్ ఫిరాయిం ది మహారాష్ట్ర నుంచి ఎన్నిక కావడం ఈ గ్రామాల విశిష్టత.
ఫ 1989లో కేకే నాయుడు కమిషన్..
ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంగా మారిన నేపథ్యంలో ఈ 12 గ్రామాల భవితవ్యం తేల్చేందుకు 1989లో కేంద్రం కేకే నాయుడు కమిషన్ నియమించింది. ఈ గ్రామాల స్థితి గతులు, భౌగోళిక పరిమాణం, సంస్కృతి సంప్రదాయాలు, రవాణా సదుపాయాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత పరందోళి పంచాయతీని విభజించి అంతాపూర్ పేరుతో మరో పంచాయతీని ఏర్పాటు చేయాలంటూ సిఫారసు చేశారు. వీటి పరిధిలోని మిగిలిన పది గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కే చెందాలని మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించి కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రత్యేక జీవోతో ఈ గ్రామాలను తెలంగాణలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థుల సహకారంంతో కోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు వ్యవహారం ఏటూ తేలకుండా పోయింది. తాము ఏ రాష్ట్రాలకు చెందిన వారో తేల్చుకోలేక గ్రామస్థులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వ్యవహారం ఎన్నికలు సందర్భాల్లో మాత్రమే ప్రముఖంగా తెరపైకి వస్తోంది.