Share News

పుట్టిన రోజునే అనంత లోకాలకు...

ABN , Publish Date - Apr 19 , 2025 | 10:29 PM

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామానికి చెందిన పూరెళ్ల అశోక్‌ (20) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం గోదావరి నదికి స్నానానికి వెళ్లి గల్లంతు కాగా శనివారం ఉదయం నదిలో శవమై తేలాడు. కుటుంబీకుల కథనం ప్రకారం శుక్రవారం అశోక్‌ పుట్టిన రోజు సందర్భంగా నదిలో స్నానం చేసి గుడికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలనుకున్నాడు.

పుట్టిన రోజునే అనంత లోకాలకు...

గోదావరి నదికి స్నానానికి వెళ్లి యువకుడి మృతి

కోటపల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామానికి చెందిన పూరెళ్ల అశోక్‌ (20) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం గోదావరి నదికి స్నానానికి వెళ్లి గల్లంతు కాగా శనివారం ఉదయం నదిలో శవమై తేలాడు. కుటుంబీకుల కథనం ప్రకారం శుక్రవారం అశోక్‌ పుట్టిన రోజు సందర్భంగా నదిలో స్నానం చేసి గుడికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలనుకున్నాడు. చీకటి పడినా అశోక్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి నది ప్రాంతమంతా గాలించారు. ఒక చోట దుస్తులు, చెప్పులు కనబడ్డాయి. కానీ అశోక్‌ జాడ తెలియలేదు. చికటి పడడంతో శనివారం ఉదయం వెళ్లి అదే ప్రాంతంలో గాలిస్తుండగా అశోక్‌ నీటిపై శవమై తేలి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు. అయితే ఆ ప్రాంతమంతా కూడా ఇసుక తవ్వకాల కోసం తవ్విన గుంత కావడం, గుంతలో నీరు నిలిచి ఉండడంతో అందులో పడి మృతిచెందినట్లు గ్రామస్తులు, కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అశోక్‌కుతల్లిదండ్రులు సావిత్రి శంకరయ్యతో పాటు ముగ్గురు సోదరులు ఉన్నారు. డిగ్రీ చదువుతున్న అశోక్‌ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడం, మరో వైపు పుట్టిన రోజునే అనంత లోకాలకు చేరడంతో మృతుడి కుటుంబీకులతో పాటు బంధువులు శోక సంద్రంలో ముగినిపోయారు.

మృతదేహంతో జాతీయ రహదారిపై ధర్నా

ఇసుక కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి అశోక్‌ మృతిచెందడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని 63వ నెంబరు జాతీయ రహదారిపై మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రస్థాయికి చేరడంతో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్‌ సీఐ సుధాకర్‌, తహసీల్దార్‌ రాఘవేందర్‌రావు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Apr 19 , 2025 | 10:29 PM