kumaram bheem asifabad- మొరాయిస్తున్న పాతఫోన్లు
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:29 PM
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు లబ్ధిదారులకు అందించే సరుకులు పక్కదారి పట్టకుండా స్మార్ట్‌ఫోన్‌తో పాటు సిమ్‌కార్డులు అందించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ స్టోరేజ్ తక్కువగా ఉన్న 4జీ మొబైల్స్ ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి.
- సర్వర్ సమస్యతో వివరాల నమోదుకు అంతరాయం
బెజ్జూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు లబ్ధిదారులకు అందించే సరుకులు పక్కదారి పట్టకుండా స్మార్ట్‌ఫోన్‌తో పాటు సిమ్‌కార్డులు అందించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ స్టోరేజ్ తక్కువగా ఉన్న 4జీ మొబైల్స్ ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. పౌష్టికాహారాన్ని ముఖచిత్ర హాజరు ఆధారంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్‌ఎస్‌టీఎస్ పోర్టల్‌లో వివరాలు పొందుపరచాలి. కేంద్రాల్లో రోజూ హాజరై చిన్నారుల ఫొటోలతో పాటు మధ్యాహ్నా భోజనం చేసే సమయంలో ఫొటో యాప్‌లో నమోదు చేయాలి. కానీ టీచర్లకు ఇచ్చిన మొబైల్స్ సక్రమంగా పని చేయకపోవడం, ఆయా ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య సర్వర్ ఇబ్బందుల కారణంగా వివరాల నమోదులో తీవ్ర ఆలస్యమవుతోంది. టీచర్లు విధిగా రెండు యాప్‌లలో నమోదు చేయాలి. పోషణ ట్రాకర్‌లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలు, ఎన్‌ఎస్‌టీఎస్‌లో యాప్‌లో ప్రభుత్వం అందించే పోషణ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ తరచూ ముఖ హాజరు నమోదుకు సర్వర్ సమస్యతో పని చేయడం లేదు. వివరాలు నమోదు చేసి ఫొటో తీసే సమయంలో నిలిచిపోవడంతో తిరిగి మొదటి నుంచి మళ్లీ నమోదు చేయాల్సి వస్తోందని టీచర్లు వాపోతున్నారు.
- 15 మండలాల పరిధిలో..
జిల్లా వ్యాప్తంగా 15మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 808మంది టీచర్లు, 526మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. 0-6నెలలు చిన్నారులు 3,457, 7నెలల నుంచి 3ఏళ్ల చిన్నారులు 20,357, 3ఏళ్ల నుంచి 7ఏళ్ల లోపు వారు 20,100మంది ఉన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన పాత ఫోన్లలోనే వివరాలు నమోదు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రస్తుతం అవి కూడా మరమ్మత్తులకు చేరడంతో సక్రమంగా పని చేయలేక అవస్థలు పడుతున్నామని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. కాగా ప్రభుత్వం గతంలో అందించిన 4జీ మొబైల్ టీచర్లకు తలనొప్పిగా మారింది. ఇబ్బంది వస్తుండడంతో పక్కన పెట్టి కొందరు తమ సొంత ఫోన్లను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం అందించిన పోన్లలో వివరాలు పొందుపరచడంలో గంటల సమయం వృథా అవుతున్నా పని పూర్తి కాని పరిస్థితి నెలకొం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన ఫోన్లు 4జీ కావడం, అవి కూడా కొన్నిచోట్ల పాడైపోయాయి. ప్రస్తుతం 5జీ టెక్నాలజీ అందుబాటులో రావడం మూలంగా వివరాల నమోదు త్వరగా అయ్యే అవకాశం ఉంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 5జీ మొబైల్స్ అందించాలని టీచర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాత మొబైల్స్‌తో అవస్థలు..
-విమల అంగన్‌వాడీ కార్యకర్త
పాత మొబైల్స్‌తో అంగన్‌వాడీ టీచర్లు అష్టకష్టాలు పడుతున్నాం. ఓ వైపు యాప్‌తో, మరోవైపు అధికారుల ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురవుతున్నాం. ఉద్యోగ విరమణ పొందిన స్థానాల్లో ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రభుత్వం వెంటనే 5జీ ట్యాబ్‌లు అందజేయాలి.
త్వరలో అందజేస్తాం..
- అడెపు భాస్కర్, జిల్లా సంక్షేమ అధికరి
అంగన్‌వాడీలకు గతంలో అందించిన పాతపోన్ల స్థానంలో కొత్త ఫోన్లు త్వరలోనే అందజేస్తాం. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాధనలు అంద జేశాం. ప్రభుత్వం నుంచి ఫోన్లు రాగానే అందజేస్తాం.