Oil Palm Cultivation: ప్రభుత్వ స్థలాల్లో ఆయిల్‌పామ్ తోటలు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:04 AM
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒకవైపు రైతులను ప్రోత్సహిస్తూనే, మరోవైపు సాగుకు యోగ్యంగా ఉండే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ ఆయిల్‌పామ్ తోటలు పెంచాలని నిర్ణయించింది. ఏ శాఖల పరిధిలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి....
నీటిపారుదల, సింగరేణి, దేవాదాయ భూములపై ఆరా
సాగుకు యోగ్యంగా ఉండే భూముల సేకరణకు చర్యలు
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం
సింగరేణి సీఎండీతో భేటీ కానున్న రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒకవైపు రైతులను ప్రోత్సహిస్తూనే, మరోవైపు సాగుకు యోగ్యంగా ఉండే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ ఆయిల్‌పామ్ తోటలు పెంచాలని నిర్ణయించింది. ఏ శాఖల పరిధిలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి? సంబంధిత శాఖల అవసరాలకు అవి ఉపయోగపడుతున్నాయా? లేదా? వాటిలో సాగుకు యోగ్యంగా ఉన్న భూమి ఎంత? తదితర వివరాలు సేకరించి ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా సింగరేణి, దేవాదాయ, నీటిపారుదలశాఖ భూములపై దృష్టి సారించారు. సంబంధితశాఖల ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా చర్చించే బాధ్యతను ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషాకు అప్పగించారు. ఈ క్రమంలోనే ఒకటి, రెండు రోజుల్లో సింగరేణి సీఎండీ బలరామ్‌తో ఉద్యాన శాఖ అధికారుల బృందం భేటీ కానుంది. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం విదితమే! రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలను ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లించాలని ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 2.72 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగులో ఉన్నాయి. రాబోయే మూడేళ్లలో సాగు విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు చేరాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. గడిచిన రెండేళ్లలో ఆశించిన ప్రగతి సాధించలేదని, మూడేళ్లలో లక్ష్యాన్ని పూర్తిచేయాలని మంత్రి తుమ్మల.. పామాయిల్ కంపెనీలు, ఆయిల్ ఫెడ్, ఉద్యానశాఖ అధికారులపై ఒత్తిడి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని 13 ప్రైవేటు కంపెనీలు ఆయిల్‌పామ్ తోటల విస్తరణ, గెలల ఉత్పత్తి, పరిశ్రమల ఏర్పాటు పనులు చేస్తున్నాయి. ఈక్రమంలోనే ప్రభుత్వ పరిధిలోని కెనాల్ బ్యాంక్(కాలువల ఒడ్డు, పరిసర ప్రాంతాలు) భూముల్లో కూడా ఆయిల్‌పామ్ మొక్కలు పెట్టాలని రాష్ట్ర ఉద్యానశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఉచితంగా మొక్కలు సరఫరా చేయాలని, తోట పెరిగి గెలలు ఉత్పత్తి అయిన తర్వాత, వాటిరి కూడా ఉద్యానశాఖ ఆధ్వర్యంలోనే సేకరించాలని, పామాయిల్ మిల్ల్లుల్లోనే గానుగ ఆడించాలని, వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని.. భూములిచ్చిన శాఖలకు ఇవ్వాలని ఉద్యానశాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
భూములివ్వడానికి సింగరేణి సమ్మతం
భూముల అప్పగింత విషయమై తాజాగా మంత్రి తుమ్మల సింగరేణి సీఎండీ బలరామ్‌తో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న సింగరేణి భూములను అప్పగించాలని, ఆయిల్‌పామ్ తోటలు పెంచి ఆదాయం చూపిస్తామని చెప్పటంతో ఆయన అంగీకరించారు. పూర్తిస్థాయిలో చర్చించి ప్రణాళిక తయారుచేయటానికి సింగరేణి ఎండీ కార్యాలయానికి వెళ్లాలని ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషాను ఆదేశించారు. అదే క్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్‌తో కూడా చర్చలు జరపాలని సూచించారు. దీంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆయిల్‌పామ్ తోటలు పెంచే కార్యక్రమానికి కసరత్తు జరుగుతోంది. ఇదిలాఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 18 ఎకరాల స్థలం ఉంది. పాఠశాల అవసరాలకు పోగా మిగిలిన భూమిలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాగా ఖమ్మం జిల్లాలో ఉద్యానశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న సుమారు 30 ఎకరాల భూమిలోనూ ఆయిల్‌పామ్ మొక్కలు నాటించారు.