Minister Tummala Nageswara Rao: ఆయిల్‌పామ్ పంటలతో నూనె అవసరాలను తీర్చుకోవచ్చు
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:49 AM
దేశంలో నూనె ఉత్పత్తుల కొరత ఉంది. విదేశాల నుంచి ఏటా లక్షన్నర కోట్ల విలువైన నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం...
ప్రస్తుతం రూ.లక్షన్నర కోట్ల విలువైన నూనె దిగుమతి
ఆయిల్‌పామ్‌లో అంతర పంటలూ వేసుకోవచ్చు: తుమ్మల
అశ్వారావుపేట/హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో నూనె ఉత్పత్తుల కొరత ఉంది. విదేశాల నుంచి ఏటా లక్షన్నర కోట్ల విలువైన నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇది దేశీయ అవసరాల్లో 70శాతంగా ఉంది. దేశంలో నూనె అవసరాలను ఆయిల్‌పామ్ పంటల సాగు ద్వారా తీర్చవచ్చు’’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో టీఎస్ ఆయిల్‌పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలుంటే.. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 10లక్షల ఎకరాలు ఉండటం గర్వకారణమన్నారు. వచ్చే మూడేళ్లలో మరో 10 లక్షల ఎకరాల్లో ఈ తోటలను విస్తరించి దేశంలోనే నెం.1 స్థాయికి చేరాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అవుతున్న నూనె దేశీయ అవసరాల్లో 30శాతంగానే ఉందని 70ు నూనె ఉత్పత్తులు విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దేశీయ నూనె అవసరాలను తీర్చేందుకు ఆయిల్‌పామ్ తోటల విస్తరణ ఒక్కటే మార్గమని, అందులో భాగంగానే తెలంగాణలోని 31 జిల్లాల్లో తోటలను విస్తరించేందుకు కేంద్రం అనుమతులు పొందామని పేర్కొన్నారు. రైతులు ఆయిల్‌పామ్ తోటలతో పాటు వక్క, జాజి, ఆవకాడ, మెకాడమియా లాంటి అంతర పంటలు, ఇతర ఉద్యాన పంటలను వేసుకోవడం ద్వారా అత్యధిక అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన వివరించారు. అనంతరం టీఎస్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ వెల్పేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా దమ్మపేటకు చెందిన ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.