Uttam Kumar Reddy: ధాన్యం సేకరణపై అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:32 AM
ధాన్యం సేకరణపై అసత్య ప్రచారం జరుగుతోందని, అధికారులు వాస్తవ లెక్కలు ఎప్పటికప్పుడు వెల్లడించాలని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు....
అధికారులు వాస్తవ లెక్కలు వెల్లడించాలి: ఉత్తమ్
పంటల సేకరణ వేగవంతంగా జరగాలి: తుమ్మల
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణపై అసత్య ప్రచారం జరుగుతోందని, అధికారులు వాస్తవ లెక్కలు ఎప్పటికప్పుడు వెల్లడించాలని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రతికూల వాతావరణంలోనూ పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపడుతున్నామని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తే రైతులకు మేలు కలుగుతుందన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరుడు ఈసమయానికి 3.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ సీజన్‌లో 8.54 లక్షల టన్నులు సేకరించి రికార్డు సృష్టించినట్లు ఉత్తమ్‌రెడ్డి తెలిపారు. 80 లక్షల టన్నుల ఽసేకరణ లక్ష్యం కాగా.. 3.95 లక్షల టన్నుల సన్నాలు, 4.59 లక్షల టన్నుల దొడ్డుధాన్యం సేకరించామన్నారు. రూ. 2,041.44 కోట్ల ధాన్యం కొనుగోలుచేసి రూ.832.90 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించినట్లు తెలిపారు. ఎప్పటి ధాన్యం అప్పుడే రైస్‌మిల్లులకు తరలించాలని, తడిసినవి కొనుగోలుచేస్తే.. నేరుగా బాయిల్డ్ మిల్లింగ్‌కు తరలించాలని, రైతులకు వాతావరణ సమాచారం చేరవేయాలని ఉత్తమ్ ఆదేశించారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లలో వేగం పెంచాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ తెచ్చిన ఎల్-1, ఎల్-2 నిబంధనతో రైతులు ఇబ్బంది పడున్నారని కలెక్టర్లు వివరించారు. స్పందించిన తుమ్మల వీటి కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్లకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రంగుమారిన సోయాబీన్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర సర్కారు ప్రతిపాదన పంపిందన్నారు. తుఫాన్‌కు 1.10 లక్షల ఎకరాల్లో ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ నివేదికను కేంద్రానికి పంపామన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ధాన్యం తేమశాతం నిబంధనలను సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.