kumaram bheem asifabad- రిజర్వేషన్లపై అధికారుల కసరత్తు
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:44 PM
గ్రామపంచాయతీల ఎన్నికల రిజర్వేషర్లపై అధికారులు కసరత్తులు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌లపై ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆసిఫాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీల ఎన్నికల రిజర్వేషర్లపై అధికారులు కసరత్తులు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌లపై ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. కులగణన ఆదారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీవోలు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా, ఎంపీడీవోలు వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీంతొఓ జిల్లాలోని 15 మండలాల్లో అధికారులు రిజర్వేషన్లపై కసరత్తులు చేపడుతున్నారు.
జిల్లాలో 335 గ్రామపంచాయతీలు.
జిల్లాలో 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2, 874 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారిగా ఓటరు జాబితాను ప్రకటించింది. ప్రభుత్వం తాజగా ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేయడంతో సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తును వేగిరం చేశారు. గతంలో బీసీలకు 42 శాతం ప్రతిపాదికంగా రిజర్వేషన్లు ఖరారు చేయగా జిల్లాలోని 335 గ్రామపంచాయతీలలో 198 ఎస్టీలకు, 32 ఎస్సీలకు, 67 బీసీలకు, 38 జనరల్ స్థానాలకు రిజర్వేషన్లను కేటాయించారు. అలాగే 2874 వార్డు స్థానాలకు గాను 1292 ఎస్టీలకు, 226 ఎస్సీలకు, 534 బీసీలకు, 822 జనరల్ స్థానాలకు రిజర్వేషన్లను గతంలో ఖరారు చేయడం జరిగింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం బీసీల రిజర్వేషన్ స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీ, ఎస్సీ స్థానాలు యధావిదిగానే ఉండనున్నట్లు తెలుస్తొంది. దీంతో గతంలో రిజర్వేషన్ అనుకూలించిన స్థానాలలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.