Share News

South Central Railway: వందే భారత్‌కు జై

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:18 AM

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్‌ హైస్పీడ్‌ రైళ్లకు ప్రయాణికుల మంచి ఆదరణ లభిస్తోంది.

South Central Railway: వందే భారత్‌కు జై

  • దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 7 రైళ్లలో ఐదింటికి పెరిగిన ఆక్యుపెన్సీ

  • సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ బోగీలు 16 నుంచి 20కు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • రైల్వే బోర్డు నుంచి అందిన కబురు

  • విజయవాడ-చెన్నై వందే భారత్‌కు త్వరలో బోగీలు పెంచే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్‌ హైస్పీడ్‌ రైళ్లకు ప్రయాణికుల మంచి ఆదరణ లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆరు మార్గాల్లో 7 వందే భారత్‌లు నడుస్తుండగా, ఐదింటిలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 115 నుంచి 135 శాతం నమోదవుతోంది. దీంతో త్వరలోనే పలు మార్గాల్లో వందే భారత్‌లకు అదనపు బోగీలు జతచేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ బోగీలను 16 నుంచి 20కు పెంచాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు రైల్వే బోర్డు నుంచి కబరు అందింది. దీనిపై వెంకన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఆక్యుపెన్సీ అధికమే అయినా...

ఇప్పటికే సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్‌ రైళ్లు పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన రేక్‌ (20 బోగీల)తో నడుస్తున్నాయి. వీటికి 126 నుంచి 129 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ ఇప్పటికే పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుస్తున్నందున బోగీలను పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ మార్గంలో మరో వందే భారత్‌ను నడపాలని తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ-చెన్నై మధ్య వందే భారత్‌ 8 బోగీలు 135 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. దాంతో 20 కోచ్‌ల రేక్‌ను మంజూరు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. త్వరలో బోగీలు పెంచే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. జాల్నా నుంచి ముంబైకి వందే భారత్‌ 8 బోగీలతో నడుస్తుండగా ఈ నెల 26 నుంచి 16 కోచ్‌లకు పెంచి నాందేడ్‌ వరకు పొడిగించారు. ఈ మార్గంలో కూడా ఆక్యుపెన్సీ పెరిగితే 20 బోగీలకు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ వందే భారత్‌కు ఆక్యుపెన్సీ 77 శాతానికి మించకపోవడంతో ఇటీవల 20 బోగీలను 8కి కుదించారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌కు ఆశించిన మేరకు ఆక్యుపెన్సీ పెరగలేదు. దీంతో బోగీల సంఖ్య పెంచే అవకాశం లేదని తెలుస్తోంది.

Updated Date - Sep 07 , 2025 | 07:19 AM