NVS Reddy: హైదరాబాద్ మెట్రో మ్యాన్ ఎన్వీఎస్ రెడ్డి
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:42 AM
మెట్రో మ్యాన్ అంటే.. శ్రీధరన్! కానీ, హైదరాబాద్ మెట్రో మ్యాన్ అంటే.. ఎన్వీఎస్ రెడ్డి! మెట్రో అంటే వెంటనే గుర్తుకు వచ్చేదీ ఆయన పేరే....
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మెట్రో మ్యాన్ అంటే.. శ్రీధరన్! కానీ, హైదరాబాద్ మెట్రో మ్యాన్ అంటే.. ఎన్వీఎస్ రెడ్డి! మెట్రో అంటే వెంటనే గుర్తుకు వచ్చేదీ ఆయన పేరే! ఇందుకు కారణం హైదరాబాద్ మెట్రోను కలగని.. దానిని పూర్తి చేయడమే! మెట్రో రైల్ ప్రాజెక్టులో ఆయనదే కీలక పాత్ర. అన్నీ తానై ముం దుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేయించారు. మెట్రో ఆరంభం అంటే 2007 నుంచీ దాదాపు 18 ఏళ్లపాటు ఆయనే మేనేజింగ్ డైరెక్టర్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదుగురు సీఎంల వద్ద పని చేయడం మరో విశేషం. పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్‌దే! దానిని విజయవంతం చేయడంతో ఆయన ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నిజానికి, 2006లో ఢిల్లీలో మెట్రో నిర్మాణం పూర్తయింది. ఆ సమయంలోనే.. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఆయనకు ప్రభుత్వం 2007లో మెట్రో ఎండీగా బాధ్యతలు అప్పగించింది. అన్ని అడ్డంకులను అధిగమించి.. మెట్రో ప్రాజెక్టు పూర్తి కావడానికి నిరంతరం శ్రమించారు.