Nursery Girl Assaulted: నేలకేసి బాది.. కాలితో తొక్కి..
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:15 AM
నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల ఆయా అమానుషంగా ప్రవర్తించింది. చెంపలపై కొడుతూ, కింద పడేస్తూ పాపపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలిక జుట్టు పట్టుకుని తలను పలుమార్లు సిమెంటు నేలకేసి బాదింది. అంతటితో ఆగక చిన్నారిని కింద పడేసి కాలితో తొక్కింది...
ఐదేళ్ల పాపపై స్కూల్ ఆయా దాడి
గొంతు పిసికి, చెంపలపై కొట్టి అమానుషం
బాలికకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో దారుణం
జీడిమెట్ల, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల ఆయా అమానుషంగా ప్రవర్తించింది. చెంపలపై కొడుతూ, కింద పడేస్తూ పాపపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలిక జుట్టు పట్టుకుని తలను పలుమార్లు సిమెంటు నేలకేసి బాదింది. అంతటితో ఆగక చిన్నారిని కింద పడేసి కాలితో తొక్కింది. ఈ పాశవిక ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్‌లో జరిగింది. దారుణాన్ని పాఠశాల పక్కనే ఉండే కొందరు పిల్లలు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి చిన్నారి తల్లిదండ్రులకు ఇవ్వడంతో ఆయా బాగోతం బయటపడింది. విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో బాధితులు ఆదివారం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా ప్రాంతానికి చెందిన సంతోషి, కలియా దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె ధరిత్రితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సంతోషి.. షాపూర్ నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో ఆయాగా పనిచేస్తోంది. ధరిత్రి అదే పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఈ కుటుంబం పాఠశాల ఆవరణలో ఓ గదిలో ఉంటోంది. ఆ పక్కనే మరో గదిలో అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తున్న లక్ష్మమ్మ ఉంటోంది. సంతోషి.. బడి బస్సులో పిల్లలను ఇంటి దగ్గర దించి రావడం వంటి పనులను చేస్తోంది. అయితే, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లక్ష్మమ్మ కొన్ని రోజులుగా చిన్నారిని చితకబాదుతోంది. ఈ విషయాన్ని ఆ పాప అనేకసార్లు తల్లికి చెప్పింది. అయితే, సంతోషి ప్రశ్నించగా.. తానెందుకు కొడతానని లక్ష్మమ్మ సమాధానం చెప్పింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తల్లి పాఠశాలలో లేని సమయంలో ధరిత్రిని లక్ష్మమ్మ దారుణంగా కొట్టింది. ఈ ఘటనను స్కూల్ పక్కన ఇంట్లో ఉన్న ఓ బాలుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన లక్ష్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.