Share News

NTR Stadium Book Fair: నేటి నుంచే పుస్తకాల పండుగ

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:23 AM

సాహిత్యాభిమానులు ఎంతగానో ఎదురుచూసే పుస్తకాల పండుగ రానే వచ్చింది. దోమలగూడ ఎన్టీఆర్‌ మైదానంలో శుక్రవారమే బుక్‌ఫెయిర్‌ మొదలవుతోంది...

NTR Stadium Book Fair: నేటి నుంచే పుస్తకాల పండుగ

  • ఎన్టీఆర్‌ స్టేడియంలో బుక్‌ ఫెయిర్‌ను ప్రారంభించనున్న మంత్రి జూపల్లి

  • విద్యార్థులు, రచయితలు, పాత్రికేయులకు ప్రవేశం ఉచితం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సాహిత్యాభిమానులు ఎంతగానో ఎదురుచూసే పుస్తకాల పండుగ రానే వచ్చింది. దోమలగూడ ఎన్టీఆర్‌ మైదానంలో శుక్రవారమే బుక్‌ఫెయిర్‌ మొదలవుతోంది. సాయంత్రం 5గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు దీనిని ప్రారంభిస్తారని బుక్‌ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షుడు, కవి యాకూబ్‌ గురువారం వెల్లడించారు. పుస్తక స్ఫూర్తి పైలాన్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. శుక్రవారం నుంచి డిసెంబరు 29వరకు రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9గంటల వరకు బుక్‌ ఫెయిర్‌ జరుగుతుందని చెప్పారు. బుక్‌ ఫెయిర్‌కు వచ్చేవారు రూ.10 ప్రవేశ రుసుము చెల్లించాలని.. కవులు, రచయితలు, పాత్రికేయులకు ప్రవేశం ఉచితమని తెలిపారు. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందించడం, దీనితో కలిగే ప్రయోజనాలను వివరించడమే బుక్‌ ఫెయిర్‌ లక్ష్యమని చెప్పారు. పుస్తక స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా కవులు, రచయితలు పెద్దసంఖ్యలో పాల్గొని తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి పంచుకుంటారని తెలిపారు. బుక్‌ ఫెయిర్‌లో పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు బాలోత్సవం, అందెశ్రీపై ప్రత్యేకంగా రూపొందించిన నృత్యరూపకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఆర్‌.వాసు తెలిపారు. హైదరాబాద్‌పై జాతీయ స్థాయిలో వచ్చిన పుస్తకాలపై ప్రత్యేక సమావేశం, బాలల వికాసంకోసం కృషిచేస్తున్న నిపుణులతో సదస్సు ఈఏడాది ప్రత్యేకమని వివరించారు.

తెలంగాణ పబ్లికేషన్స్‌ స్టాల్‌ రద్దు

బుక్‌ ఫెయిర్‌లో తెలంగాణ పబ్లికేషన్స్‌ స్టాల్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. పదేళ్ల పాటు బుక్‌ఫెయిర్‌ సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన కోయ చంద్రమోహన్‌ ఆర్థిక లావాదేవీల రసీదులు, మినిట్స్‌ బుక్‌, ఇతర పత్రాలు అందజేయకపోవడంతో ఆయన స్టాల్‌ను రద్దు చేసినట్టు తెలిపారు. అయితే బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షుడు, ప్రతినిధులు తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కోయ చంద్రమోహన్‌ ఆరోపించారు. కాగా, తెలంగాణ పబ్లికేషన్స్‌కు స్టాల్‌ను నిరాకరించడం తప్పుడు నిర్ణయమని బుక్‌ఫెయిర్‌ సొసైటీ వ్యవస్థాపక ఆర్గనైజర్‌ సోము గోపాలరావు, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 04:23 AM