kumaram bheem asifabad- మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:03 PM
ప్రభుత్వం మద్యం దుకాణాల గెజిట్ నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించనున్నారు. గతంలో నాన్ రిఫండబుల్‌గా ఉన్న రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుంను రూ. 3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాలలో ఎస్టీ, ఎస్సీ, గౌడ్ కులస్తులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించనున్నారు.
- లక్కీ డ్రా పద్ధతిన రిజర్వేషన్ల ప్రకారం షాపుల కేటాయింపు
- జిల్లాలో 32 మద్యం దుకాణాలు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మద్యం దుకాణాల గెజిట్ నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించనున్నారు. గతంలో నాన్ రిఫండబుల్‌గా ఉన్న రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుంను రూ. 3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాలలో ఎస్టీ, ఎస్సీ, గౌడ్ కులస్తులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ రిజర్వేషన్ ప్రకారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అదికారులు లక్కీ డ్రాలో రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాలను కేటాయించారు. కొత్త మద్యం పాలసీ ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి నవంబరు 30, 2027 వరకు అమలులో ఉంటుంది. రెండేళ్ల పాటు ఈ కొత్త పాలసీ మద్యం విదానం షాపులు పని చేస్తాయి. శుక్రవారం నుంచి అక్టోబరు 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అక్టోబరు 23న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల ఎంపిక చేపట్టనుంది. జనాభా ఆధారం గా మద్యం దుకాణాల స్లాబ్‌లను నిర్ణయించింది. ఐదువేల లోపు జనాభా కలిగి ఉన్న ప్రాంతాల్ల దరఖాస్తు ఫీజు రూ. 50 లక్షలు, ఐదువేల నుంచి 50వేల జనాభా కలిగిన ప్రాంతాలలో రూ. 55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా కలిగి ఉన్న ప్రాంతాలలో రూ. 60 లక్షలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లక్ష నుంచి ఐదు లక్షల జనాభా కలిగిన ప్రాంతాలలో రూ. 65 లక్షలు, ఐదు లక్షల నుంచి 20 లక్షల జనాభా కలిగిన ప్రాంతాలలో రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతాలలో రూ. 1.10 కోట్లు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం నిర్ణయిం చింది.
- రిజర్వేషన్ల ప్రకారం..
జిల్లాలో లక్కీ డ్రా పద్ధతిన రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ను గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నిర్వహించారు. 2025-2027 సంవత్సరానికి గాను జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు గాను నాలుగు ఎస్సీ, ఎస్టీ ఒకటి, గౌడ కులస్తులకు రెండు రిజర్వేషన్ ప్రకారం దుకాణాలను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 32 మద్యం దుకాణాలలో రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన ఎంపిక చేశామని చెప్పారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో షాప్‌నెంబరు 1,4, కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలో షాప్‌నెంబరు 1, సిర్పూర్(టి)లో ఒకటి, మొత్తం నాలుగు షాపులు షెడ్యూల్ కులాల వారికి, రెబ్బెన మండలం గోలేటి, బెజ్జూరు మండల కేంద్రంలోని షాపులను గౌడ కులస్తులకు, కౌటాల మండల కేంద్రంలోని ఒక షాపు ఎస్టీలకు కేటాయించామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, డీడీ రమాదేవి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు.