Liquor Shop Licenses: ఒక్క దరఖాస్తూ రాలేదు!
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:55 AM
మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణలో ఎక్సైజ్ శాఖ అంచనాలు తలకిందులవుతున్నా యి. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని...
మంగళవారం.. అష్టమి ఎఫెక్ట్!
ముహూర్తం బాగోలేదంటూ దరఖాస్తుల దాఖలుకు మద్యం వ్యాపారులు దూరం
గడువుకు మిగిలింది నాలుగు రోజులే
ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులు 7 వేలే
లక్ష వస్తాయని అంచనా వేసిన ఎక్సైజ్
ఇక రోజుకు 20 వేలకు పైగా రావాలి!
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణలో ఎక్సైజ్ శాఖ అంచనాలు తలకిందులవుతున్నా యి. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని ఆశించిన అధికారులకు మంగళవారం ప్లస్ అష్టమి కావ డంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క దరఖాస్తూ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు సమీపిస్తున్న కొద్దీ ఒక్క రోజూ కీలకమైనా.. మంగళవారం, అష్టమి ప్రభావం పడింది. దాదాపు రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించి, భవిష్యత్తులో కోట్లాది రూపాయల వ్యాపారానికి వేసే తొలి అడుగును అశుభ ఘడియల్లో వేయడానికి ఎవరూ సాహసించలేదు. తెలుగు రాష్ట్రాల్లో పనులు మొదలుపెట్టేవారు ముహూర్తాలను ఎంత బలంగా నమ్ముతారో దీన్ని బట్టి రుజువైంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ ఐక్య కార్యచరణ కమిటీ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో బ్యాంకులు మూతపడితే దరఖాస్తులపై మరింత ప్రభావం పడనుంది. దరఖాస్తుకు ఈ నెల 18వ తేదీ ఆఖరు.. అంటే మిగిలింది కేవలం 4 రోజులే. గత నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైనా ఇప్పటి వరకు వచ్చినవి 7,238 మాత్రమే. ఆదివారం వరకు 5,663.. సోమవారం 1,575 వచ్చాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల లక్ష దరఖాస్తుల లక్ష్యం సాఽధనకు ఇంకా 90 వేలకుపైనే రావాల్సి ఉంది. దరఖాస్తుల విక్రయంతో దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందన్న ఎక్సైజ్ శాఖ ప్రచారంతో వాటిని తమకు రావాల్సిన రూ.3,151 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని మద్యం సరఫరాదారులు డిమాండ్ చేశారు. 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. గతంలో దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.లక్ష పెంచింది.
చివరి మూడు రోజుల్లో భారీగా వస్తాయి!
గతంలో చివరి మూడు రోజుల్లోనే 75 శాతం దరఖాస్తులు వచ్చాయి. అలాగే రాబోయే మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయి. వాటికి అనుగుణంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం.
-హరికిరణ్, కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ