Nomination Scrutiny Drama: నామినేషన్ల స్ర్కూటినీ.. హైడ్రామా..!
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:01 AM
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా షేక్‌పేటలోని రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది..
చీప్రధాన పార్టీల అభ్యర్థుల పరస్పర అభ్యంతరాలు.. అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం
మాగంటి మొదటి భార్య కుమారుడినని.. పేర్కొంటూ సోషల్ మీడియాలో లేఖ వైరల్
ఫిర్యాదు అందినట్లుగా పేర్కొన్న అధికారులు
దానిని పరిగణనలోకి తీసుకోలేదని వివరణ
భారీగా నామినేషన్లు.. 211 మంది.. 321 సెట్లు
టోకెన్లు ఇచ్చి.. నామినేషన్ల పరిశీలన
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా షేక్‌పేటలోని రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. పలువురు అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో స్ర్కూటినీ వద్ద టెన్షన్ వాతావరణం కనిపించింది. అభ్యంతరాలు, సందేహాల నివృత్తి మధ్య కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్‌యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డిలు వేసిన నామినేషన్లను ఆర్‌వో ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఆర్‌ఆర్‌ఆర్ , ఫార్మాసిటీ బాధిత రైతులతో పాటు మాల సంఘాల జేఏసి నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. స్ర్కూటినీ సమయంలోనూ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు టోకెన్ పద్ధతిని అమలు చేశారు. దీని ప్రకారం అభ్యర్థిని పిలిచి నామినేషన్లు పరిశీలించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ పత్రాల విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో కుటుంబ విషయాలు కూడా ఉండటంతో ఇవన్ని తమ పరిధి కాదని ఎన్నికల అధికారి బదులిచ్చారు. కొద్దిసేపటికి నవీన్‌యాదవ్ ఫారం-26లో కొన్ని కాలములు పూర్తి చేయలేదని.. ఇదే కారణంతో స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరించారని సునీత తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో కొద్దిసేపు ఆర్‌వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఎన్నికల అధికారి ఇద్దరి నామినేషన్లు అమోదించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ వరకు అవకాశముంది.
నామినేషన్ల తిరస్కరణ..
సరైన పత్రాలు లేకపోవడం, ఫారం పూర్తిగా నింపకపోవడం వంటి కారణాలతో పలు నామినేషన్లు తిరస్కరించారు. బోరబండ, షేక్‌పేట, రహ్మత్‌నగర్‌లో కొద్దికాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చర్చలో ఉన్న సల్మాన్‌ఖాన్‌కు చెందిన నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. స్ర్కూటినీలో బుధవారం రాత్రి 11 గంటల వరకు 144 మంది అభ్యర్ధులకు సంబంధించి 232 నామినేషన్లను పరిశీలించారు. ఇందులో 80 మంది అభ్యర్ధుల 126 నామినేషన్లను తిరస్కరించగా.. 64 అభ్యర్ధుల 106 నామినేషన్లను ఆమోదించారు.
మాగంటి సునీతపై ఫిర్యాదు!
బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతపై గోపినాథ్ మొదటి భార్య మాలిని కుమారుడు ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన తల్లికి విడాకులు ఇవ్వకుండా సునీతతో గోపినాథ్ కలిసి ఉన్నారని, వారు వివాహం చేసుకోలేదని, లివింగ్ రిలేషన్‌షి్‌పలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. గోపినాథ్ భార్య అని సునీత చెబుతన్న దాంట్లో వాస్తవం లేనందున ఆమె నామినేషన్ తిరస్కరించాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై ఎన్నికల సంఘం అధికారులను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందినట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదును ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదు. సునీత.. గోపినాథ్ భార్యనా..? కాదా..? అన్నది తేల్చాల్సిన బాధ్యత తమది కాదని, ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాలని ఈసీ సూచించింది. ఇదిలా ఉంటే విదేశాల్లో ఉంటోన్న ప్రద్యుమ్న ఎక్కడా మాట్లాడినట్టు వీడియోలు లేకపోవడం గమనార్హం. కాగా.. ఈ లేఖపై తాను మాట్లాడదలుచుకోలేదని సునీత తెలిపారు. వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసునని, తన అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను వేసిన నాలుగు సెట్ల నామినేషన్లను ఆమోదించినట్లు ఆమె తెలిపారు.
పనికిమాలిన అభ్యంతరాలు: నవీన్‌యాదవ్
తన నామినేషన్లపై బీఆర్‌ఎస్ పనికిమాలిన అభ్యంతరాలను లేవనెత్తిందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఆరోపించారు. తాను దాఖలు చేసిన మూడు సెట్ల నామినేషన్లు ఆమోదించినట్లు తెలిపారు. కాంగ్రె్‌సపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, తాను ఎవరి వ్యక్తిగత విషయాలపై వాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.