Share News

Minister Komatireddy Venkat Reddy: 10 రోజులు టోల్‌ వద్దు!

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:48 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ చార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Minister Komatireddy Venkat Reddy: 10 రోజులు టోల్‌ వద్దు!

  • హైదరాబాద్‌-విజయవాడ హైవేపై టోల్‌ప్లాజాల వద్ద 9 నుంచి 18 వరకు చార్జీలు వసూలు చేయొద్దు

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ చార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే జనవరి 9 నుంచి 18 వరకు పది రోజులపాటు ఎన్‌హెచ్‌-65పై వెళ్లే వాహనాలకు పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు. సంక్రాంతి పండుగకు కొద్దిరోజుల ముందు నుంచి.. అంటే జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు టోల్‌ చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఎంతో మంది ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్య లేకుండా సొంతూళ్లకు వెళ్లే అవకాశం కలుగుతుందని తెలిపారు. సాధారణ సమయం కంటే పండుగ సమయంలో టోల్‌ప్లాజాల వద్ద దాదాపు 200 శాతం అదనంగా ట్రాఫిక్‌ ఉంటుందని లేఖలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గంటల తరబడి వేచి ఉండడంతో సమయం వృధా అవుతుందని వివరించారు. ఇదే విషయంపై మంత్రి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. టోల్‌ప్లాజాల వల్ల ట్రాఫిక్‌ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా దృష్టి సారించారని చెప్పారు. అవసరమైతే ఒకటి రెండు రోజుల్లో తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీని ప్రత్యేకంగా కలిసి మరోసారి ఈ అంశంపై విజ్ఞప్తి చేస్తానన్నారు. తప్పనిసరైతే టోల్‌ప్లాజాల వద్ద కనీస రుసుము చెల్లించేందుకు ఆర్‌అండ్‌బీ సిద్ధంగా ఉందని అన్నారు.

ట్రాఫిక్‌ను స్వయంగా పరిశీలిస్తా..

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌-65పై ట్రాఫిక్‌జామ్‌, రోడ్ల మరమ్మతులు జరుగుతున్న చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ, మోర్త్‌ ఆర్వోలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తూఫ్రాన్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించేందుకు తానే స్వయంగా వస్తానన్నారు. ఈసారి ట్రాఫిక్‌ ఆగడానికి వీల్లేదని అన్నారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ఆయా జిల్లాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాన్నారు. ‘‘పండుగ సమయంలో నేను డ్యూటీలో ఉంటా. అధికారులు కూడా డ్యూటీలో ఉండాలి. అందరం కలిసి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేద్దాం. పండుగకు వెళ్లే వారంతా క్షేమంగా వెళ్లి, పండుగను ఆనందంగా జరుపుకొని తిరిగి రండి’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 04:48 AM