13 ఏళ్లుగా ప్రమోషన్లకు దూరం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:08 PM
బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన కొత్త జోన్ల ఏర్పాటు పోలీసు శాఖకు చెందిన పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లకు శాపంగా మారింది. జోన్‌ల ఏర్పాటుతో నిబంధనలు వర్తించక పదోన్నతులకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
- జీవో 317తో అన్యాయం జరిగిందని ఎస్‌ఐల ఆవేదన
- పదోన్నతుల కోసం 102 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ల ఎదురుచూపు
- బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త జోన్ల ఏర్పాటు
మంచిర్యాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన కొత్త జోన్ల ఏర్పాటు పోలీసు శాఖకు చెందిన పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లకు శాపంగా మారింది. జోన్‌ల ఏర్పాటుతో నిబంధనలు వర్తించక పదోన్నతులకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేసింది. అయితే అప్పటి నుంచి దాదాపు 13 సంవత్సరాలు గడుస్తున్నా వారంతా ఇన్‌స్పెక్టర్ ప్రమోషన్లకు నోచుకోవడం లేదు. మల్టీజోన్-1లో ఉన్న ఈ బ్యాచ్ అధికారుల్లో దాదాపు అందరికీ ఇప్పటికే ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు లభించగా మల్టీజోన్-2కు చెందిన వారికి ప్రమోషన్లు అందని ద్రాక్షలా మారాయి. 2012 బ్యాచ్‌కు చెందిన కొందరితోపాటు 2014 బ్యాచ్‌కు చెందిన జూనియర్లు సైతం ప్రమోషన్లు పొందగా పదోన్నతికి నోచుకోని వారు తిరిగి వారి బ్యాచ్‌మేట్లకే సెల్యూట్ చేయాల్సి వస్తుందని మనోవేదనకు గురవుతున్నారు.
2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5వ జోన్ నుంచి 146 మంది ఎస్‌ఐలుగా పోలీసుశాఖలో చేరారు. అందులో 2021లో 45 మంది ఎస్‌ఐలకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. గతంలో 5వ జోన్‌లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉండేవి. కాగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో అవి మల్టీజోన్-1, మల్టీజోన్ -2గా ఏర్పడ్డాయి. గతంలో 5వ జోన్‌లో ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాలు మల్టీజోన్-1 పరిధిలోకి వచ్చాయి. ఈ కారణంగా కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి 66 మంది ఎస్‌ఐలు 5వ జోన్ ఎస్‌ఐలపైన సీనియారిటీలో చేరడంతో పదోన్నతిలో తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది.
ఫ కొత్త జోన్ల ఏర్పాటుతో గందరగోళం...
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జోన్ల ఏర్పాటు 2012 బ్యాచ్ ఎస్‌ఐలను గందరగో పరిస్థితిలోకి నెట్టింది. 2012 బ్యాచ్‌లో కేవలం 35 మందికి పదోన్నతి లభించగా వీరితో పాటు 2014 బ్యాచ్‌కు చెందిన ఇద్దరికి ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. 317 జీవో కారణంగా ఆరు సంవత్సరాలకే దక్కాల్సిన పదోన్నతులు... పన్నేండేళ్లు గడిచినా రాకపోవడంతో 102 మంది ఎస్‌ఐలుగా మిగిలిపోయారు. పుష్కరకాలం గడుస్తున్నా పదోన్నతికి నోచుకోకపోవడం వల్ల వారంతా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని నిరసిస్తూ పాత సీనియారిటీ ప్రకారమే పదోన్నతి కల్పించాలని, 317 జీవో వల్ల నష్టపోయామని 102 మంది ఎస్‌ఐలు కొంతకాలంగా పాలకులు, పోలీసుశాఖ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం సరైన ప్రామాణికత లేకుండా తీసుకొచ్చిన 317 జీవో కారణంగా పాత 6వ జోన్‌లోని కొన్ని జిల్లాలు మల్టీజోన్-1లో కలపడం వల్ల ఆయా జిల్లాలకు చెందిన 66 మంది ఎస్‌ఐలు సీనియారిటీ జాబితాలో ముందుకు వెళ్లడంతో మిగితా వారికి అన్యాయం జరిగింది. ఈ కారణంగా దాదాపు 102 మంది ఎస్‌ఐలకు పదోన్నతులు రాక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరు కూడా ఇంత సుదీర్ఘకాలం పాటు ఎస్‌ఐలుగా పనిచేసిన సందర్భాలు లేవు. ఇదిలా ఉండగా పోలీసుస్టేషన్ల అప్‌గ్రేడేషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పాత 6వ జోన్‌లో అప్‌గ్రేడేషన్ జరిగింది. అయితే పాత 5వ జోన్ అయిన వరంగల్‌జిల్లాలో మాత్రం ఇప్పటికీ 54 పోలీసుస్టేషన్‌లు అప్‌గ్రేడేషన్‌కు నోచుకోలేదు. దీంతో ఎస్‌ఐల పదోన్నతులకు మోక్షం లభించడం లేదు. కాగా 317 జీవో వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి పాత సీనియారిటీ ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన పలువురికి పదోన్నతి, మరికొందరికి నష్టం కలిగించే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి పదోన్నతి కల్పించాలని వేడుకుంటున్నారు.