ఎన్ని మిల్లులు తిరిగినా..
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:50 AM
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్నిరకాల ధాన్యాన్ని కొన్ని మిల్లులే కొనుగోలు చేస్తుండడంతో తమ ధాన్యం ఏ మిల్లుల్లో విక్రయించాలో తెలియక ట్రాక్టర్ల లోడుతో తిరుగుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే మిల్లుల వద్దకు చేరినప్పటికీ రాత్రి 7గంటల వరకు కొనుగోళ్లు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల వద్ద వందల సంఖ్యలో ధాన్యం లోడు ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. మిల్లర్లు తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. కనీస మద్దతు ధరకు మిల్లర్లు మంగళం పాడినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లు గుమస్తా ఎప్పుడు వస్తాడో... షీకు కొట్టి ధానానికి రేటు కట్టి దిగుమతి చేసుకుంటాడోనని ఎండల్లో చెమటలు కక్కుతూ మిల్లుల ఎదుట పడిగాపులు కాస్తున్నామని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.
క్వింటా ధాన్యానికి రూ.300 తగ్గింపు
రెండు రోజుల క్రితం వరకు క్వింటాకు రూ.2300-2350 వరకు కొనుగోలు చేసిన మిల్లర్లు అకస్మాత్తుగా క్వింటాకు రూ.300 తగ్గించి సన్నధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొన్ని రకాల ధానాన్ని మిల్లర్లు రూ. 2000-2100లకే కొనుగోలు చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. సాధారణ చింట్ల రకాలను సైతం రూ.2220-2230 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహీంద్ర చింట్ల రకాన్ని రూ.2100-2150వరకు కొనుగోలు చేయగా హెచ్‌ఎంటీ ధాన్యాన్ని క్వింటాకు రూ.2000కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. గత సీజన్‌లో చింట్ల రకాల కంటే హెచ్‌ఎంటీ రకాన్ని రూ.50 తక్కువకు మాత్రమే కొనుగోలు చేయగా ఈ సారి రూ.300ల వరకు తగ్గించి కొంటున్నారని ఆరోపిస్తున్నారు.
మద్దతు ధర అధికారుల మౌనం
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో అధికారులు విఫలమౌతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే మిల్లర్లు తక్కువకు కొనుగోలు చేస్తున్నప్పటికీ అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమౌతున్నారని రైతులు ఆరోపిస్తున్నా రు. ప్రభుత్వం క్వింటాకు రూ.2320 మద్దతు ధర ప్రకటించినప్పటికీ రూ.2000-2200ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రూ.2300 కంటే తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని మిల్లర్ల సమావేశంలో హెచ్చరించినప్పటికీ సిండికేట్‌గా మారిన మిల్లర్లు అధికారుల ఆదేశాలు లెక్కచేయడం లేదని అంటున్నారు. షీకు కొట్టిన ధానాన్ని మిల్లరు కొంత పిడికిటిలో పట్టి క్షనంలో నాణ్యతను, ధరను ప్రకటిస్తున్నారని, వారు చెప్పిన ధరకే రైతులు విధిలేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తోందని కన్నీటి పర్యంతరం అవుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క లోడే విక్రయించా
తెల్లవారు జామున 4 గంటలకే మూడు హెచ్‌ఎంటీ ధాన్యం ట్రాక్టర్ లోడ్‌లతో మిల్లుల వద్దకు వచ్చాను. సాయంత్రం 6 గంటల వరకు ఒక్కలోడ్ అమ్మా. క్వింటాకు 2000 చొప్పున కొనుగోలు చేశారు. ఇంకా రెండు లోడ్‌లను రోడ్డుపై నిలబెట్టి మిల్లుల చుట్టూ తిరుగుతున్నా. అవంతీపురం రోడ్‌లో హెచ్‌ఎంటీ రకం కొంటున్నారంటే మిల్లు వద్ద ఎదురుచూస్తున్నా.
జాల నవీన్ రైతు, చీదేళ్ల, పెన్‌పహాడ్ మండలం
రూ.2,230లకే కొనుగోలు చేశారు
నాలుగు ట్రాక్టర్లు చింట్ల ధాన్యాన్ని మిల్లుకు అమ్మడానికి తెచ్చాను. తాలు, పచ్చగింజ వుందన్న నెపంతో క్వింటాకు రూ.2230కే కొనుగోలు చేశారు. రెండు రోజుల క్రితం రూ.2350 వరకు కొనుగోలు చేయగా ఈ రోజు క్వింటాకు వంద తగ్గించారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.
రావుల జాను, తిమ్మాపురం, దామరచర్ల మండలం
ఎప్పుడూ లేని నిబంధన ఇప్పుడెందుకు?
తిప్పర్తి/కోదాడ రూరల్/వేములపల్లి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ‘ఎప్పుడూ లేని నిబంధనలు ఇప్పుడెందుకు?.. తాలు పేరుతో ఐదు రోజులుగా ధాన్యం కాంటాలు ఆపుతారా?.. అంటూ రైతులు మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిప్పర్తి మండల కేంద్రంలోని సబ్‌మార్కెట్ యార్డులో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో ఎక్కువ తాలు ఉందంటూ లోడ్ లారీలను మిల్లు నిర్వాహకులు దిగుమతి చేసుకునేందుకు నిరాకరించారు. ఐదు రోజులుగా లారీలు దిగుమతి కాకపోవటంతో ధాన్యం కాంటాలు వేయడం కుదరదని తిప్పర్తి సబ్‌మార్కెట్ నిర్వాహకులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఐదు రోజులుగా 30వేల క్వింటాళ్ల ధాన్యం కాంటాలు వేయకపోవడంతో ఆగ్రహించిన సుమారు 100మంది రైతులు తిప్పర్తి మండల కేంద్రంలోని అద్దంకి - నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై మంగళవారం 15 నిమిషాల పాటు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎప్పుడూ లేని నిబంధన ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఒకరిద్దరు రైతుల ధాన్యంలో తాలు ఉందనే సాకుతో ఐదు రోజులుగా రైతులందరి ధాన్యాన్ని కాంటా వేయకుండా నిలిపివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకైయ్యారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న డీఎస్‌వో హరీష్, తహసీల్దార్ పరుశురామ్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు రైతుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఐ సాయిప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చారు. ధాన్యం కాంటా వేయిస్తామని అధికారులు ఫోన్‌లో హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవటంతో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు.
తక్షణమే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలి
ధాన్యం కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమ్మర గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆర్భాటంగా రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారని, నేటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదన్నారు. సాగర్ ఎడమకాల్వ కింద వరికోతలు 20రోజుల క్రితమే ప్రారంభమైనా నేటికీ కొనుగోళ్లను ప్రారంభించలేదన్నారు. మొదట్లో క్వింటా ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేసిన మిల్లర్లు ప్రస్తుతం రూ.1,800కే అడుగుతూ నిలువునా దోపీడీ చేస్తున్నారన్నారు. మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదన్నారు. రైతుల రాస్తారోకోతో కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ వాజిద్ అలీ, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌లు చేరుకుని రైతులతో మాట్లాడి బుధవారం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
మద్దతు ధర ఇవ్వడంలేదు
మిల్లర్లు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద రైతులు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శెట్టిపాలెం శివారులోని మిల్లులకు సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, హుజూర్‌నగర్ ప్రాంతాలతో పాటు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల, అడవిదేవులపల్లి, తిప్పర్తి నకిరేకల్ మండలాలతోపాటు ఆయకట్టు నుంచి భారీగా ధాన్యం తరలివస్తోంది. మంగళవారం ఒక్కొక్క మిల్లు వద్దకు మఽధ్యాహ్నాం సమయానికి హెచ్‌ఎంటీ రకం ధాన్యం సుమారు 50 నుంచి వంద ట్రాక్టర్ల వరకు రావడంతో మిల్లర్లు తమ గరిషెలు నిండాయని కొనుగోలు చేయలేమంటూ ధాన్యం కొనేందుకు సుమారు రెండు గంటల పాటు విరామం ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనతో సుమారు పావుగంట పాటు రాస్తారోకోకు దిగారు. ఈ క్రమంలో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతర ాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడతానని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ మిల్లుల వద్దకు సన్నరకం ధాన్యమైన హెచ్‌ఎంటీ, చింట్లూ రకాలు భారీగా తరలివస్తున్నాయని, ప్రారంభంలో సన్నరకం ధాన్యాన్ని క్వింటాకు రూ.2,500 నుంచి రూ.2700 వరకు కొనుగోలు చేశారన్నారు. ప్రస్తుతం ఒక్కసారిగా ధర తగ్గించి చింట్లూ రూ.2,200 నుంచి రూ.2,300కు కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. హెచ్‌ఎంటీ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారని, తప్పని పరిస్థితుల్లో రూ.2,100 నుంచి రూ.2,200 మధ్య మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో కనీస మద్దతు ధర రూ.2,300 కూడా పొందలేని స్థితిలో నష్టపోవాల్సిన పరిస్థితి రైతులు వివరించారు.