Fee Reimbursement Delay: డబ్బుల్లేవ్.. రెండు నెలల తర్వాతే!
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:54 AM
తీవ్ర నిధుల కొరత కారణంగా ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పట్లో విడుదల చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది...
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై సర్కారు వైఖరి
8దసరా తర్వాత నిరవధిక సమ్మెకు ప్రైవేటు కాలేజీలు సిద్ధం.. నేడు ప్రకటన
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తీవ్ర నిధుల కొరత కారణంగా ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పట్లో విడుదల చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం బకాయిల్లో రూ.600 కోట్లు దసరా లోపు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంఘాల సమాఖ్య(ఫాతీ) ప్రతినిధుల సమక్షంలో సెప్టెంబరు-15న మీడియా ముందు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలేజీల వారీగా విడుదల చేయనున్న బకాయిల వివరాలనూ విద్యాశాఖ ప్రకటించింది. అప్పటినుంచి ఫాతీ చైర్మన్ నిమ్మగడ్డ రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్, సంస్థాగత కార్యదర్శి కె.సునీల్ కుమార్, కోశాధికారి కె.కృష్ణారావు బృందం నిత్యం ఆ మంత్రులను కలిసి.. నిధుల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. దసరాకు ముందు కనీసం రూ. 300 కోట్లు అయినా ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత సోమవారం పేర్కొన్నారు. బుధవారం నుంచి దసరా సెలవులు ఉన్నందున.. మంగళవారం నిధులు విడుదల చేస్తారని యాజమాన్యాలు ఆశించాయి. కానీ.. ‘‘మరో రెండు నెలల వరకూ విడుదల చేయడం కష్టం.. డబ్బుల్లేవు’’ అని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మంగళవారం పేర్కొన్నారు. దీనిపై ఫాతీ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 600 కోట్లు విడుదల చేస్తామంటూ మంత్రులు అధికారికంగా హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. తదుపరి కార్యాచరణకు బుధవారం నగరంలోని బోట్స్ క్లబ్‌లో అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దసరా తర్వాత నిరవధిక సమ్మె నిర్వహించే అంశంపై ఈ భేటీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.