Deputy CM Bhatti: మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:22 AM
డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలకే పోతున్నాయి. ఇక మిగిలిందేమీ లేదు. రీయింబర్స్‌మెంట్‌పై నేనేం చేయలేను..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేనేం చేయలేను.. డబ్బులన్నీ జీతాలు, పథకాలకే సరిపోతున్నాయి
‘ప్రైవేటు కాలేజీల’కు డిప్యూటీ సీఎం భట్టి స్పష్టీకరణ
సమ్మె విరమించుకోవాలన్న మంత్రి శ్రీధర్‌బాబు
1200 కోట్లైనా ఇవ్వాలి: సంఘం ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలకే పోతున్నాయి. ఇక మిగిలిందేమీ లేదు. రీయింబర్స్‌మెంట్‌పై నేనేం చేయలేను. మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి’’ అని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోతే సోమవారం నుంచి బంద్ పాటిస్తామని నోటీసు ఇచ్చిన కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు.. శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ.1200 కోట్లను వెంటనే విడుదల చేస్తే సమ్మె యోచన విరమించుకుంటామని, మిగతా నిధులు నిర్ధిష్ట కాలపరిమితిలోగా ఇవ్వాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ఏమీ లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో వారు సమావేశమయ్యారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భారీ స్థాయి నిధులతో ముడిపడిన అంశమైనందున క్రమకమంగా పరిష్కరిస్తామని శ్రీధర్‌బాబు అన్నారు. సమ్మె ఆలోచన విరమించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సైతం వారితో సమావేశమయ్యారు. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిల వివరాలు తెలుసుకున్నారు. దాదాపుగా రూ.3500 కోట్లు రావాల్సి ఉందని ప్రతినిధులు పేర్కొనగా.. విడతలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న తరుణంలో సమ్మె నిర్ణయం సరి కాదన్నారు. కాగా, మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం కాలేజీల యాజమాన్యాలు సమావేశం కానున్నాయి. మంత్రులతో జరిగిన చర్చలు, ఇతర అంశాలపై అందరితో చర్చించి.. బంద్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యాల సమాఖ్య చైర్మన్ ఎన్.రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్, సంస్థాగత కార్యదర్శి కే సునీల్ కుమార్ తెలిపారు.