Justice Sudarshan Reddy: భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:42 AM
న్యాయవ్యవస్థకు పత్రికా రంగానికి అత్యంత అవినాభావ సంబంధం ఉందని, పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ...
ప్రభుత్వాలు లేకున్నా ఫర్వాలేదు పత్రికలు మాత్రం తప్పనిసరి
సి.రాఘవాచారి 6వ స్మారకోపన్యాసంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థకు పత్రికా రంగానికి అత్యంత అవినాభావ సంబంధం ఉందని, పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ న్యాయస్థానాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణగా నిలిచాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదని, ఇది కేవలం న్యాయసూత్రం కాదు జీవన సత్యమన్నారు. ‘ప్రభుత్వాలు లేకపోయినా ఫర్వాలేదు కానీ పత్రికలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి’ అన్న అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్ థామస్ జెఫర్సన్ మాటలను ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వాలు వ్యక్తిగత కక్షతో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా పత్రికా ప్రచురణకు అవాంతరాలు కలిగిస్తే అది ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకమే అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కేసును ఉదహరించారు. రాఘవాచారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షరశస్త్రధారి, పీపుల్స్ ఎడిటర్ సి.రాఘవాచారి 6వ స్మారకోపన్యాస కార్యక్రమం శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ‘ప్రసార మాధ్యమాలు-న్యాయ వ్యవస్థ’ అంశంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలకోపన్యాసం చేశారు. పత్రికా స్వేచ్ఛను నియంత్రించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కనుక నాటి నెహ్రూ ప్రభుత్వం 19వ అధికరణకు సవరణ చేసి క్లాజ్ 2ను జతచేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం సోషల్‌మీడియా సంప్రదాయ మీడియా పరిఽధి దాటిందన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మంది సంపన్నులు సోషల్ మీడియాను శాసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు సంపాదనకన్నా, నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు అంకితమైన గొప్ప ప్రజా సంపాదకుడు రాఘవాచారి అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి కొనియాడారు. మహాభారత, రామాయణాలను వామపక్ష, ప్రగతిశీలవాదులు విస్మరించడంవల్ల మత ఛాందసవాదులు వాటి స్ఫూర్తికి విరుద్ధంగా లేని రంగులద్ది ప్రచారంలో పెడుతున్నారని విమర్శించారు.