Telangana Govt: రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దు
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:29 AM
చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిర్‌పల వైద్యం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లలకు దగ్గు మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని ...
రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరిక
చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిర్‌పల వైద్యం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లలకు దగ్గు మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనల మేరకు వైద్యులు, తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అడ్వయిజరీ జారీ చేసింది. రెండేళ్లలోపు బాలలకు దగ్గు మందు ఇవ్వొద్దని, ఐదేళ్లలోపు పిల్లలకూ సాధారణంగా సిర్‌పలు వాడొద్దని పేర్కొంది. ఐదేళ్లు దాటిన చిన్నారులకు అవసరమైన మేరకు వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో తక్కువ కాలంపాటు సిర్‌పలు వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కూడా నాణ్యమైన తయారీ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులే రోగులకందించాలని కోరింది. ఇదిలా ఉంటే, 2025 మే నుంచి 2027 ఏప్రిల్ వరకూ గడువు గల ఎస్‌ఆర్-13 బ్యాచ్ కోల్ర్డిఫ్ సిర్‌పను వాడొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. తమిళనాడులోని స్రేసన్ కంపెనీ తయారు చేసిన ఈ సిరప్ కలిగి ఉన్న వారు వెంటనే సమీప ఔషధ నియంత్రణ అధికారులకు అప్పగించాలని కోరింది. సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 అందుబాటులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బోధనాస్పత్రులకు ఈ సూచనలను తెలపడంతోపాటు కఠినంగా అమలు చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించింది. దగ్గుమందుపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరింది.