Harish Rao Criticizes CM Revanth Reddy: రేవంత్‌రెడ్డికి రైతులంటే పట్టింపు లేదు
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:57 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకునుడే తప్ప రైతుల మీద పట్టింపు లేదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు...
మక్కల విక్రయానికి రైతుల పడిగాపులు: హరీశ్‌రావు
చిన్నకోడూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకునుడే తప్ప రైతుల మీద పట్టింపు లేదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో ఆరబోసిన మక్కలను ఆదివారం ఆయన పరిశీలించి రైతులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటికే అధిక వర్షాలు పడి పత్తి రైతులకు దిగుబడి తగ్గి నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పత్తిని కొనకుండా రైతులకు మరింత నష్టం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న సాగైందని మక్కలను రైతులు మార్కెట్‌లో పెట్టుకోని పడిగాపులు కాస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో సకాలంలో మక్కలు కొనుగోలు చేశామని ప్రస్తుతం మక్కలు చేతికి అందిన ఫలితం దక్కడం లేదని ధ్వజమెత్తారు. తొందరపడి రైతులు దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. వెంటనే పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం 11 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నదని విమర్శించారు.