Share News

No Candidates for Reserved Sarpanch Post: అభ్యర్థే లేరు.. సర్పంచ్‌ ఎవరు?

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:23 AM

ఆ ఊర్లో పంచాయతీ ఎన్నిక నిర్వహించినా, లేదా ఏకగీవ్రంగా ఎన్నుకున్నా అతడు మాత్రమే సర్పంచ్‌ అవుతాడు! మరొకరయ్యే అవకాశం లేనే లేదు. మరో ఊర్లోనూ అంతే.. వెయ్యిమంది దాకా ఓటర్లు ఉన్నా, ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వానేనా అన్నట్లుగా గట్టి పోటీ ఉన్నా.. ‘ఆ కుటుంబం’ నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్‌ పదవి చేపట్టక ...

No Candidates for Reserved Sarpanch Post: అభ్యర్థే లేరు.. సర్పంచ్‌ ఎవరు?

  • కొన్నిచోట్ల అనివార్యంగా ఒక ఇంటికే పదవి

  • ఖమ్మం జిల్లాలో మంగలితండా బీసీ మహిళకు

  • ఆ ఊర్లోని 829 మందిలో బీసీ మహిళ ఒక్కరే

  • నల్లగొండ జిల్లాలో ఏడు తండాలు బీసీలకు

  • ఆ తండాల్లో ఒక్కరంటే ఒక్క బీసీ ఓటరు లేరు

  • రాష్ట్రవ్యాప్తంగా పలుగ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఆ ఊర్లో పంచాయతీ ఎన్నిక నిర్వహించినా, లేదా ఏకగీవ్రంగా ఎన్నుకున్నా ‘అతడు’ మాత్రమే సర్పంచ్‌ అవుతాడు! మరొకరయ్యే అవకాశం లేనే లేదు. మరో ఊర్లోనూ అంతే.. వెయ్యిమంది దాకా ఓటర్లు ఉన్నా, ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వానేనా అన్నట్లుగా గట్టి పోటీ ఉన్నా.. ‘ఆ కుటుంబం’ నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్‌ పదవి చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకో ఊర్లో గణనీయంగా జనాభా ఉన్నా సర్పంచ్‌ పదవికి ఏకంగా ‘అభ్యర్థే’ దొరకని పరిస్థితి నెలకొంది. మరో గ్రామంలోనేమో అక్కడికి వలసొచ్చిన ఆ యువకుడినే అనివార్యంగా సర్పంచ్‌గా ఎన్నుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకిలా? అనంటే రిజర్వేషన్లు అమలులో పారదర్శకత పాటించకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే కారణం అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్‌ ఎన్నికల కోసం 2018 రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని, రొటేషన్‌ పద్ధతిని ఆవలంబించడం.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణనను ప్రామాణికంగా తీసుకోవడంతోనే కొన్నిచోట్ల ఈ గందరగోళ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగలితండాలో 829 మంది ఉంటారు. అంతా గిరిజనులే. ఇక్కడ సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ.. బానోత్‌ అనిత అనే బీసీ మహిళ తండాకు కోడలిగా వచ్చింది. ఆమె నిరుడు తండాలోని సైదులు అనే ఓ గిరిజన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫలితంగా అనితకే సర్పంచ్‌ పదవి ఏకగ్రీవంగా దక్కనుంది. సోమవారం అనితకు మంత్రి పొంగులేటి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈమె ఒక్కరే బీసీ కావడంతో బీసీలకు కేటాయించిన వార్డు పదవులూ ఖాళీగానే ఉండనున్నాయి.

  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ధర్మాతండాను బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఇక్కడ అంతా గిరిజనులే. కుమ్మరికుంట్ల నాగరాజు అనే యువకుడు పక్కనే ఉన్న కేశ్వాపురం గ్రామం నుంచి తన భార్యతో కలిసి ధర్మాతండాకు వలసొచ్చి ఓ నర్సరీ నడుపుతున్నాడు. అక్కడ నాగరాజు, అతడి భార్య మాత్రమే బీసీ ఓటర్లు కావడంతో ఇద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉంది. నాగరాజుకు మంత్రి పొంగులేటి కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు.


  • ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం రాఘవాపురంలో ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. అయితే ఇక్కడ మొత్తమ్మీద ఇద్దరే ఎస్సీ ఓటర్లున్నారు. ఆ ఇద్దరూ తల్లీకొడుకులే. సర్పంచ్‌ పదవి ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కనుంది. గ్రామంలోని రెండో వార్డు ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఆ పదవి తల్లికి వెళితే.. కొడుకు సర్పంచ్‌ కానున్నాడు. నాలుగో వార్డును ఎస్సీ జనరల్‌కు ఇవ్వడంతో కొడుకు వార్డు మెంబర్‌ అయితే.. తల్లి సర్పంచ్‌ కానుంది.

  • సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం ఉప్పలచలక గ్రామపంచాయతీ షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నందున సర్పంచ్‌తోపాటు 4వార్డు పదవులు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. ఈ పంచాయతీలో ఒక్క ఎస్టీ కుటుంబమే ఉంది. అందులో ముగ్గురు ఓటర్లుండగా వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఆ ఇంట్లో మిగిలిన రుద్రజారాణి అనే యువతి ఒక్కరే సర్పంచ్‌ పదవికి పోటీచేసే అవకాశం ఉంది. ఎస్టీలకు కేటాయించిన 4వార్డులు ఖాళీగా ఉండనున్నాయి.

  • వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయితీ షెడ్యూల్‌ ఏరియాలో ఉంది. దీంతో ఇక్కడ సర్పంచి ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. అలాగే నాలుగువార్డులు ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. అంటే.. సర్పంచ్‌ పదవి, ఆ నాలుగు వార్డులు ఖాళీగానే ఉండనున్నాయి.

  • నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో బీసీలకు తూర్పుతండా, జైత్రాంతండా, నూనావత్‌తండా, బాండావత్‌తండా, గోన్యతండా, మాన్‌తండా, బాలాజీనగర్‌ పంచాయతీలను బీసీలకు రిజర్వు చేశారు. ఈ ఏడు చోట్ల కూడా ఒక్కరంటే ఒక్క బీసీ ఓటరు లేరు. ఫలితంగా సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసే వారే కరువయ్యారు. మాడ్గులపల్లి మండలం అభంగాపురం సర్పంచ్‌ పదవిని ఎస్టీకి రిజర్వ్‌ చేయగా, ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ కూడా లేరు. అడవిదేవులపల్లి మండలంలోనూ బీసీకి కేటాయించిన చంప్లతండా గ్రామపంచాయతీలో ఒక్క బీసీ ఓటరు లేరు.

  • నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గజలాపురంలో ఒక్క ఎస్టీ ఓటరే ఉన్నారు. అక్కడ ఎస్టీకే రిజర్వ్‌ చేయడంతో ఆయనే సర్పంచ్‌ కానున్నారు. చందంపేట మండలం గుంటిపల్లిని బీసీలకు రిజర్వ్‌ చేశారు. ఈ ఊర్లో ఒక్క బీసీ కుటుంబమే ఉంది. ఆ ఇంట్లోంచే ఎవరో ఒకరు పదవి చేపట్టనున్నారు. అడవిదేవులపల్లి మండలం గోన్యతండా, జిలకర్రకుంట తండాలు బీసీలకు రిజర్వ్‌ కాగా, ఇక్కడ ఒక్కో బీసీ కుటుంబం మాత్రమే ఉంది. ముదిమాణిక్యం గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వ్‌ కాగా, ఇక్కడా ఒక్క కుటుంబమే ఉంది.

  • కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం అంకోల్‌ గ్రామం సర్పంచ్‌ ఎస్టీకి రిజర్వు అయింది. ఊర్లో ఒక్క ఎస్టీ కూడా లేరు.

  • నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్‌, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ గిరిజనులే. ఈ రెండు గ్రామాల్లో బీసీ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించారు. లింగాపూర్‌ గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు ఉండగా బీసీ జనరల్‌కు కేటాయించారు.

  • నిర్మల్‌ జిల్లా రంగాపూర్‌ మండలం హన్మాన్‌ తండాలో బీసీలే లేరు. ఇక్కడ బీసీలకు సర్పంచ్‌ పదవి రిజర్వ్‌ చేశారు.

  • ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని సావర్గాం, పిచర, అరెపల్లిలో బీసీలు లేరు. కానీ వీటిని బీసీలకు రిజర్వ్‌ చేశారు.

Updated Date - Sep 30 , 2025 | 05:23 AM