Share News

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టుకు శ్రీధర్‌ రావు

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:54 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనపై అనేక దారుణాలకు పాల్పడ్డారని బాధితుడు ఎస్‌.శ్రీధర్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైటెక్‌ సిటీలోని...

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టుకు శ్రీధర్‌ రావు

  • ప్రభాకర్‌ రావుకు బెయిల్‌ అర్హత లేదు

  • దురుద్దేశంతో క్రిమినల్‌ నేరారోపణలు మోపి వేధించారు

  • పిటిషన్‌లో పేర్కొన్న బాధితుడు శ్రీధర్‌రావు

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనపై అనేక దారుణాలకు పాల్పడ్డారని బాధితుడు ఎస్‌.శ్రీధర్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైటెక్‌ సిటీలోని పెట్రోల్‌ పంపునకు సంబంధించి టీవీ యాంకర్‌ సాంబశివరావుతో ఉన్న వివాదాల్లో జోక్యం చేసుకుని తనను నిర్బంధించి రూ. 15 కోట్లు బలవంతంగా వసూలు చేశారని తన పిటిషన్‌లో శ్రీధర్‌రావు తెలిపారు. రూ.15 కోట్లలో రూ.13 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించగా, మిగతా రూ. 2 కోట్లను టీవీ యాంకర్‌ సాంబశివరావు తన వద్ద ఉంచుకున్నారని వివరించారు. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు బంధువైన రవీందర్‌ రావుతో ఉన్న వివాదాల మూలంగా ఎస్‌ఐబీ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ ద్వారా మాజీ డీఎ్‌సపీ ప్రణీత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో తనపై నిరంతర నిఘా వేసి ఫోన్లు ట్యాప్‌ చేశారని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించినప్పటికీ ప్రభాకర్‌రావు పలుకుబడి మూలంగా తనపై క్రిమినల్‌ చర్యలు కొనసాగించారని, ఇందుకు బీఆర్‌ఎస్‌ నేతల ఒత్తిడి కూడా కారణమని పేర్కొన్నారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా వందలాది వ్యక్తుల వివరాలు అక్రమంగా సేకరించారని, అధికార పార్టీకి సహాయపడేందుకు టెలిఫోన్‌ సంభాషణలను అడ్డుకుని సమాచారం సేకరించారని, అందులో తన ఫోన్‌ కూడా ఉందని శ్రీధర్‌ రావు తన పిటిషన్‌లో వివరించారు. డబ్బులు ముట్టచెప్పినప్పటికీ తనపై దురుద్దేశంగా క్రిమినల్‌ నేరారోపణలు మోపి వేధించారని, మరింత మొత్తం చెల్లించడానికి ఒప్పుకోకపోతే 2021 నవంబర్‌ 9 నుంచి 18 వరకు వివిధ పోలీస్‌ స్టేషన్లలో 11 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. తనకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించినప్పటికీ చిక్కబల్లాపూర్‌ వద్ద బెంగళూరు-హైదరాబాద్‌ హై వేపై అరెస్టు చేశారని చెప్పారు. ఆరోపణల తీవ్రత రీత్యా ప్రభాకర్‌ రావుకు బెయిల్‌ లభించేందుకు ఏ మాత్రం అర్హత లేదని ఆయన వాదించారు.

Updated Date - Oct 09 , 2025 | 05:54 AM