Share News

MLA Katipally Venkata Ramana Reddy: గ్రేటర్‌లో చెరువుల కబ్జాలపై చర్యల్లేవు

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:33 AM

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పలు చెరువులను పూర్తిగా కబ్జా చేసి భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవ....

MLA Katipally Venkata Ramana Reddy: గ్రేటర్‌లో చెరువుల కబ్జాలపై చర్యల్లేవు

  • ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు

  • హెచ్‌ఎండీఏ, హైడ్రా, జీహెచ్‌ఎంసీలపై ఆరోపణ.. హైకోర్టులో కామారెడ్డి ఎమ్మెల్యే పిటిషన్‌ కామారెడ్డిలో అంతా సక్రమంగా ఉందా?.. ధర్మాసనం ప్రశ్న

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పలు చెరువులను పూర్తిగా కబ్జా చేసి భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రేమావతిపేట్‌ పెద్దచెరువు, శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలో చెరువు, దుండిగల్‌ గండిమైసమ్మ మండలం గాగిలాపూర్‌లో చెరువు, గండిపేట్‌ మండలం పుప్పాల్‌గూడ ముక్కసాని కుంటలను పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మార్చారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బొండెంపల్లి రాములు వాదిస్తూ ఈ అంశంపై తొలుత తాను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని పేర్కొన్నారు. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని డివిజన్‌ బెంచ్‌ సూచించడంతో ప్రస్తుత పిటిషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘పిటిషనర్‌ ఒక ఎమ్మెల్యే. చాలా పవర్‌ఫుల్‌ వ్యక్తి. చెరువులు, కుంటలు, జలవనరులు, నాలాల కబ్జాలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా? పిటిషనర్‌ కామారెడ్డి ఎమ్మెల్యే.. కామారెడ్డి పట్టణంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేకుండా అంతా సక్రమంగా ఉందా? అని ప్రశ్నించింది. న్యాయవాది సమాధానం ఇస్తూ. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని పలుమార్లు లేవనెత్తారని పేర్కొన్నారు. మంత్రులు సమాధానం ఇస్తూ కబ్జాలను తొలగించడానికి హైడ్రా వంటి వ్యవస్థలను ఏర్పాటు చేశామని, అక్కడ ఆధారాలతో ఫిర్యాదు చేయాలని చెప్పారని గుర్తుచేశారు. మంత్రులు చెప్పిన విధంగానే ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పోలిస్తే కామారెడ్డిలో అక్రమ నిర్మాణాలు తక్కువని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు సమాధానం ఇస్తూ ఫిర్యాదులో చాలా అంశాలు ఉన్నాయని, అన్ని పరిశీలించి ఆరువారాల్లో తగిన ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివరణ తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైడ్రా, రెరా, ఆయా జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదాపడింది.

Updated Date - Oct 11 , 2025 | 02:33 AM