Share News

HC Orders Telangana Govt: కేసీఆర్‌, హరీశ్‌లపై వచ్చే నెల 7 వరకు చర్యలొద్దు

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:48 AM

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక, విజిలెన్స్‌ విభాగం నివేదిక, ఇతర అంశాల ఆధారంగా కాళేశ్వరం...

HC Orders Telangana Govt: కేసీఆర్‌, హరీశ్‌లపై వచ్చే నెల 7 వరకు చర్యలొద్దు

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • సీబీఐ దర్యాప్తు జీవోపై జోక్యానికి నో

  • పిటిషన్లో ఆ అంశం లేదని స్పష్టీకరణ

  • ఎన్డీఎ్‌సఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు: సర్కార్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్‌సఏ) నివేదిక, విజిలెన్స్‌ విభాగం నివేదిక, ఇతర అంశాల ఆధారంగా కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికకు, తాము సీబీఐ ద ర్యాప్తు కోరడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐను స్వతంత్రంగా మొత్తం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయాలని కోరామని వెల్లడించింది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఈ దర్యాప్తు ఉండబోదని స్పష్టం చేసింది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించేందుకు తామిచ్చిన జీవోలో అక్రమాలకు ఎవరు బాధ్యులు? ఎవరిపై దర్యాప్తు చేయాలి? అని ఏ పేర్లనూ ప్రస్తావిస్తూ అడగలేదని తెలిపింది. ఘోష్‌ కమిషన్‌ నివేదికపై శాసనసభలో చర్చించామని, అయితే నివేదిక ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపింది. చర్యలు తీసుకుంటే అందుకు సంబంధించిన చర్యా నివేదికను శాసనసభలో పెడతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

కాళేశ్వరం కమిషన్‌ నివేదికను కొట్టేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాడీవేడిగా వాదనలు జరిగాయి. నివేదికను శాసనసభలో చర్చించినప్పటికీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కొద్దిరోజుల క్రితం కేసీఆర్‌, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ని వేదికపై చర్యలు తీసుకున్నారా? తీసుకోబోతున్నారా? నిర్ణయం పెండింగ్‌లో ఉందా? చెప్పాలని సోమవా రం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ అంశంపై అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ జారీచేసిన జీవో, సీబీఐ ఎంట్రీపై నిషేధం ఎత్తివేతకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ధర్మాసనానికి అందజేశారు. కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారంగా సీబీఐ దర్యాప్తును కోరలేదని, ఎన్డీఎ్‌సఏ, విజిలెన్స్‌ తదితర నివేదికల ఆధారంగా కోరామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం సీబీ ఐ దర్యాప్తు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తాము విచారిస్తున్నది పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికకు సంబంధించిన అంశమ ని, పిటిషనర్లు కమిషన్‌ నివేదికను సవాల్‌ చేస్తూ పిటిషన్లు వేశారని ప్రస్తావించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం వేరే విషయమని, కావాలంటే దాన్ని సవాల్‌ చేస్తూ విడిగా పిటిషన్లు వేసుకోవచ్చని సూచించింది. కమిషన్‌ నివేదికలోని అంశాలను ఆధారంగా చేసుకొని పిటిషనర్లపై వచ్చే విచారణ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కౌంటర్ల కోసం తదుపరి విచారణ అక్టోబరు 7కు వాయిదా పడింది.


మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక..: కేసీఆర్‌

వాదనల సందర్భంగా కేసీఆర్‌ తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వాదనలు వినిపిస్తుంటే అడ్డుకోవడాన్ని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తన క్లయింట్‌(కేసీఆర్‌)ను ఎదుర్కొనే దమ్ము లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమిషన్‌ నివేదికను ముందు పెట్టుకుని కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా రచ్చ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కమిషన్‌ నివేదిక న్యాయ సమీక్షకు నిలబడే పరిస్థితి కనిపించకపోవడంతో సీబీఐ దర్యాప్తునకు సదరు నివేదిక ఆధారం కాదంటూ తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

ఘోష్‌ నివేదికపై మరో పిటిషన్‌

ఘోష్‌ కమిషన్‌ నివేదికను కొట్టేయాలని కోరు తూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు అయింది. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి(రిటైర్డ్‌) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషన్‌ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కమిషన్‌ తనను సాక్షిగా మాత్రమే పిలిచిందని గుర్తు చేశారు. చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.

Updated Date - Sep 03 , 2025 | 04:48 AM